నయీం కేసులో ఎంతటి మొనగాడున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ హౌం మంత్రి నాయని నరసింహారెడ్డి శనివారం శాసనమండలిలో గొప్పగా ప్రకటించారు.ఇలాటి మాటలు వింటుండగానే నెలలు గడిచిపోయాయి గాని అడుగుపడింది లేదు. ఓటుకు నోటు కేసులోనే ఏమీ చేయని వారు దీంట్లో ఏదో చేస్తారనుకోవడం అర్థం లేని పని. 210 మీద కేసులు పెట్టామని 126 మందిని అరెస్టు చేశామని హొం మంత్రి చెబుతున్నారు. కాని వారంతా చోటా అనుచరులే తప్ప చెప్పుకోదగిన శాల్తీ ఒకటైనా లేదు. పోలీసు అధికారులు ఫోటోలతో సహా దొరికినా పట్టించుకోలేదు. విశాఖపట్టనంలో వున్న ఇదే నాయని వాటి ఆధారంగా చర్యలు తీసుకోలేమని చెప్పేశారు! విపరీతంగా వినిపించిన పేరు శాసనమండలి ఉపసభాపతి నేతి విద్యాసాగర్ది కాగా ఆయనపైనా రాజకీయంగా కూడా చర్య తీసుకున్నది లేదు. తెలంగాణలో వరుసగా పోలీసు అధికారులు ఆత్మహత్యలు చేసుకున్న చలనం లేదు. లోతైన విచారణా లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆఱ్ ఎంతటివారినైనా వదిలపెట్టే ప్రసక్తి లేదని ప్రకటించారు గాని కొంతవారైన నేతలను కూడా పట్టుకున్నది లేదు! ఇంత ఆలస్యం చేస్తే సాక్ష్యాధారాలు ఎక్కడ మిగులుతాయి? కనుక నాయని నరసింహారెడ్డి వ్యర్థ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆ ఆధారాలు దగ్గర పెట్టుకుని అనుమానితులను అదుపులో పెట్టుకునే పని జరుగుతున్నదని అందరూ సందేహిస్తున్నారు. ఆ మేరకు అధికార టిఆర్ఎస్ నేతలు సంకేతాలు కూడా ఇచ్చేశారు.