తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభం మరో రెండు నెలల్లో ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. పూర్తి కావొచ్చిన భవన నిర్మాణ ఫోటోను కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెక్రటేరియట్ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. గతంలోనూ పలుమార్లు స్వయంగా నిర్మాణ పనులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు దాదాపు పూర్తి కావొస్తుండటంతో.. మళ్లీ చూసేందుకు సీఎం సెక్రటేరియట్ వెళ్లారు. సాధ్యమైనంత త్వరగా నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సెక్రటేరియట్ డిజైన్లను ఆయన మరోసారి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. రూ. 617 కోట్లతో జరుగుతున్న సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే సరికి ఇంకా ఎక్కువే అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ వైభవానికి ప్రతీకగా సెక్రటేరియట్ భవనం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో పాత సెక్రటేరియట్ భవనాలు నిక్షేపంలా ఉన్నప్పటికీ మొత్తం నేలమట్టం చేసి అదే ప్రాంతంలో కొత్త భవనం నిర్మిస్తున్నారు.
పాత సెక్రటేరియట్ భవనాల్లో ఏపీకి కూడా వాటా ఉంది.అయితే జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు అప్పగించేశారు. ఆ తర్వాత వాటిని వెంటనే కూలగొట్టేశారు. నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటికి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ .. కరోనా ఇతర కారణాల వల్ల వాయిదా పడుతోంది. రెండు నెలల్లో ఆ సెక్రటేరియట్ నుంచి పాలన ప్రారంభించే అవకాశం ఉంది. కేసీఆర్ సెక్రటేరియట్ నుంచి పాలన సాగించి ఏళ్లు దాటిపోయింది.