మొత్తానికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రోజురోజుకీ టెన్షన్ పెంచేస్తోంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ. యూపీలో పాగా వేసిన దగ్గర నుంచీ మన ఇద్దరు చంద్రులకూ బెంగ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే.. భాజపా తరువాతి లక్ష్యం తెలంగాణ అనీ, ఆ తరువాత ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం స్పష్టంగానే కనిపిస్తోంది. భాజపాతో వీలైనంత ఫ్రెండ్లీగా ఉండటం ద్వారా రాష్ట్రంలో భాజపాను బలపడనీయకుండా చెయ్యొచ్చన్నది ఆయన విజన్గానే కనిపిస్తోంది. ఇంకోపక్క, కేసీఆర్ వ్యూహం ఏంటంటే… తెరాసను అన్ని కులాలకూ దగ్గర చేయడం ద్వారా మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు. అయితే, భాజపా తాజాగా చేసిన ప్రకటన ముందు ఈ పప్పులేవీ ఉడికేట్టుగా లేవని అనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ చేసేందుకు కేంద్రం సిద్ధమౌతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. యూపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం, రైతుల రుణాలను మాఫీ చేస్తుందనీ.. ఆ ఆర్థిక భారాన్ని కేంద్రం భరిస్తుందని మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దుమారం రేగుతోంది. రైతు ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర సంగతి ఏంటంటూ సీఎం ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఏంటంటూ తమిళనాడు కూడా కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. ఇక, తెలంగాణలో కూడా రైతుల రుణమాఫీ భారాన్ని కేంద్రమే భరించాలంటూ తెరాస నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయి.
అయితే, ఈ హామీ ద్వారా తెరాస, టీడీపీలకు కొత్తగా మొదలైన టెన్షన్ వేరే ఉంది! వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రా, తెలంగాణలో ఇదే హామీతో భాజపా సోలోగా రంగంలో దిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముందుగా యూపీలో ఈ హామీని అమలు చేసి… తరువాత, వచ్చే ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే హామీ ఇస్తే… ఆ ప్రభావం తెరాస, తెలుగుదేశంపై బాగానే పొడచ్చు. ఎందుకంటే, గత ఎన్నికల్లో ఈ హామీతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కూడా ఇదే హామీతో మెజారిటీ పెంచుకున్నారు. అయితే… ఈ హామీ అమలులో ఇద్దరు చంద్రులూ తడబడ్డారని చెప్పక తప్పదు.
దశలవారీగా అమలు అంటున్నారే తప్ప… పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసిందని లేదనేది క్షేత్రస్థాయిలోకి తొంగి చూస్తూ అర్థమౌతోంది. చాలామంది రైతుల్లో ఎలాగూ ఈ అసంతృప్తి ఉండనే ఉంది. ఇదే హామీతో వచ్చే ఎన్నికల్లో భాజపా రంగంలోకి దిగితే తమకు ఇబ్బందే అనేది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొత్తగా మొదలైన టెన్షన్. ఒకవేళ.. ఇప్పుడు యూపీతోపాటు తమకూ రుణమాఫీకి సాయం చేయండని కోరినా కూడా సమస్యే..! ఎందుకంటే, ఇంతవరకూ రుణమాఫీ చేయడంతో తామే గొప్ప అంటూ తెరాస, టీడీపీ చాటుకుంది. ఇప్పుడు కేంద్ర సాయం కోరితే, ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందిస్తే… ఆ క్రెడిట్ మొత్తం భాజపా అకౌంట్లోకి షిప్ట్ అయిపోవడం ఖాయం కదా! మొత్తానికి, రుణమాఫీ విషయంలో కేంద్రంలోని భాజపా ఎలా స్పందించినా మన చంద్రులకు టెన్షన్ తప్పేట్టు లేదు.