జన్మభూమి కమిటీలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అప్పట్లో టీడీపీ నియమించింది. అయితే, ఇప్పుడు కమిటీల పనితీరు ప్రభుత్వం పరువును బజారుకు ఈడ్చేలా చేస్తోందని అధికార పార్టీ ఒప్పుకున్నట్టయింది! కమిటీల పనితీరుపై ఈ మధ్యా వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయట. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కేటాయింపుల్లో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారనీ, అస్మదీయులకే ప్రభుత్వ ఫలాలు అందేలా చేస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమిటీలపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర సర్వే చేయించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం పరువు తీసే స్థాయిలో కమిటీల పనితీరు ఉంటోందని సదరు సర్వేలో తేలినట్టు సమాచారం. దీంతో ఇప్పుడున్న జన్మభూమి కమిటీలను ఒక్క కలం పోటుతో సీఎం రద్దు చేశారు. వీటి స్థానంలో కొత్త కమిటీలు వేస్తారని చెబుతున్నారు. సీఎం నిర్ణయంతో 12 వేల కమిటీలను ఒకేసారి రద్దు చేసినట్టయింది.
గడచిన ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ ఎంతో శ్రమించిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ కోసం పాటుపడ్డ కార్యకర్తలకు పదవులు కల్పించాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున జన్మభూమి కమిటీలను సీఎం ఏర్పాటు చేశారు. వీటిని వేసి మూడేళ్లు దాటుతున్నా పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదట! పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా… కమిటీల పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. అంతేకాదు, చాలా కమిటీల్లో సభ్యులు అతిగా ప్రవర్తించడం మొదలుపెట్టారనే ఫిర్యాదులు పెరిగాయి. పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలందరి కోసం అమలు చేస్తుంటే… అవన్నీ ముందుగా తమవారికే దక్కాలన్న ఉద్దేశంతో కమిటీల సిఫార్సులు ఎక్కువైపోయాయట. దీంతో చాలామంది అనర్హులకు పింఛెన్లు లాంటివి దక్కడంతోపాటు, అర్హులైన సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదనే విమర్శలు పెరిగాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా కమిటీ సభ్యులను ఏమీ అనలేని పరిస్థితి. దీంతో, ఇంకా ఉపేక్షిస్తూపోతే అధికార పార్టీ పరువు పోయేట్టుగా ఉందనే ఉద్దేశంతో ఒకేసారి అన్నింటినీ ముఖ్యమంత్రి రద్దు చేశారు.
అయితే, ఒకేసారి 12 వేల కమిటీలను రద్దు చేయడం ద్వారా కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయనివారిని గుర్తించి, వారి వరకే చర్యలు పరిమితం అయితే మిగతావారికి గుణపాఠంగా ఉండేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. కొత్త కమిటీలు అయినా సరిగా పనిచేస్తాయా లేదా అనేది వేచి చూడాలంటూ కొంతమంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, జన్మభూమి కమిటీలు టీడీపీ సర్కారుకి బాగానే తలనొప్పులు తెచ్చాయి!