ఏప్రిల్ నుంచి పెద్ద సినిమాల హడావుడి మొదలు కానుంది. ఈనెల 9న `వకీల్ సాబ్` వస్తున్నాడు. మేలో అయితే జాతరే జాతర. ఒకేనెలలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. అందులో బోణీ కొట్టేది మెగాస్టార్ `ఆచార్య`నే. మే 13న ఈ సినిమా విడుదల అవ్వాలి. ఇంకా.. 40 రోజుల సమయం ఉంది. షూటింగ్ ఇంకాస్త బాకీ ఉంది. దాంతో గొడవ లేదు. ప్రమోషన్లూ మెల్లమెల్లగా మొదలెట్టేస్తారు. అయితే సీజీ వర్క్‌తోనే ఈ సినిమాకి తలనొప్పులు మొదలయ్యాయని సమాచారం.
కొరటాల శివ సినిమాల్లో సీజీ వర్కులకు పెద్దగా స్కోప్ ఉండదు. ఆయన కథలన్నీ ఎమోషనల్ టచ్‌తో సాగేవే. కానీ.. `ఆచార్య`లో సీజీ వర్క్ ప్రాధాన్యం ఉంది. ఇది పురాతన దేవాలయాల నేపథ్యంలో సాగే కథ. అందుకు సంబంధించిన కొన్ని సెట్స్ వేసినా, అవన్నీ పాక్షికంగానే. ఎక్కువగా సీజీపై ఆధారపడిపోయారని టాక్. అయితే ఆ పనులు చాలా వరకు పెండింగ్‌లో ఉండిపోయాయని తెలుస్తోంది. సీజీతో పెట్టుకుంటే ఓ పట్టాన పూర్తవదు. సీజీ కంపెనీలు… చెప్పిన సమయానికి వర్క్ ఇవ్వడానికి సతాయిస్తుంటాయి. ఇప్పుడు ఆ గోల `ఆచార్య`కూ మొదలైందని టాక్. సీజీ నిపుణులతో పనిచేయడం.. కొరటాల శివకు ఇదే తొలిసారి. కాబట్టి.. ఆయనా టెన్షన్ పడుతున్నాడట. అనుకున్న సమయానికి సీజీ వర్క్స్ వస్తాయా, రావా? అనే సందేహాలు ఉన్నాయని, అయితే… ఓ టీమ్ మాత్రం కేవలం ఆచార్య సీజీ వర్క్స్ పైనే పనిచేస్తోందని తెలుస్తోంది.