సంక్రాంతి సినిమాల గురించి ఎంత మాట్లాడుకొన్నారో, థియేటర్ల ఇష్యూ గురించి కూడా అంతే మాట్లాడుకొన్నారు. ముఖ్యంగా ‘హనుమాన్’ సినిమాకి ఎక్కడా థియేటర్లు దొరకలేదు. 12న గుంటూరు కారంతో హనుమాన్ అనే ఓ చిన్న సినిమా పోటీ పడడం కూడా అందరిలోనూ ఆశ్చర్యాన్ని నింపింది. హనుమాన్ అనవసరంగా రిస్క్ చేస్తోందని, ఓరోజు ముందు వచ్చినా హనుమాన్ గట్టెక్కేదని సానుభూతి తెలిపారు. ‘హనుమాన్’ సినిమాకి తక్కువ థియేటర్లు దొరికినా, ఎవరూ ఏం అనలేని పరిస్థితి. ఎందుకంటే ఎదురుగ్గా ఉన్నది మహేష్ బాబు సినిమా. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎవరైనా సరే… గుంటూరు కారం వైపే చూస్తారు. కాబట్టి… సహజంగానే హనుమాన్‌కి థియేటర్ల విషయంలో మొండిచేయి ఎదురవుతుంది. ఈ విషయం హనుమాన్ టీమ్ కీ బాగా తెలుసు.
కాకపోతే ‘హనుమాన్’ కంటెంట్ ని గట్టిగా నమ్ముకొంది. తొలి రోజు థియేటర్లు దొరక్కపోయినా మౌత్ టాక్ తో కొత్త థియేటర్లు వస్తాయని నమ్మింది. అంతే కాదు.. మిగిలిన మూడు సినిమాల్లో ఏ ఒక్కటి డల్ అయినా అది హనుమాన్‌కి ప్లస్. అన్నింటికంటే ముఖ్యంగా శుక్ర, శని, ఆది, సోమ, మంగళ ఇలా.. అన్ని రోజులూ సెలవలే. కాబట్టి మెల్లగా అయినా థియేటర్ల సంఖ్య పెంచుకోవొచ్చు. ప్రేక్షకులూ సినిమాని చూడ్డానికి రెడీగానే ఉంటారు. ఈ క్యాలిక్లేషన్స్ హనుమాన్ విషయంలో వర్కవుట్ అయ్యేలానే ఉన్నాయి. గురువారం హనుమాన్ ప్రీమియర్లకు ఊహించని స్పందన వచ్చింది. రివ్యూలు రేటింగుల్లో ఆధిపత్యం సంపాదించింది. అదే సమయంలో గుంటూరు కారం టాక్ డీలా పడిపోయింది. తొలిరోజు మహేష్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, అడ్వాన్స్ బుకింగుల దృష్ట్యా.. ‘గుంటూరు కారం’కి తిరుగు ఉండకపోవొచ్చు. కానీ రెండో రోజైనా సరే… `హనుమాన్`కి థియేటర్లు వదలాల్సిందే. కాకపోతే ఇప్పటి వరకూ ‘మాకు థియేటర్లు ఇవ్వండి’ అని హనుమాన్ టీమ్ అడిగేది. ఇప్పుడు వాళ్లే. ‘మా థియేటర్లో మీ బొమ్మ వేసుకోండి’ అని హనుమాన్ టీమ్ ని అడగాల్సివస్తుంది. సినిమా చిన్నదైనా, పెద్ద దైనా రిజల్ట్ లో తేడా వస్తే… ఇంతేమరి!