బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రయోగాలకు పెద్దపీట వేసే నటులు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరికీ ఇప్పుడో పెద్ద సమస్య ఎదురవుతోంది. తమతో సమానంగా, తమకు పోటీగా నటించగల సత్తా ఉన్న ప్రతినాయకులు గురించి.. అయితే విలను లేకనో లేకపోతే ప్రయోగాల మీద వారికి ప్రేమ మరింత పెరిగిపోతుందో కానీ.. ఎవరికి వారే.. తమ సినిమాలో విలన్లుగా తామే నటించాలనుకుంటున్నారు… నటిస్తున్నారు కూడా..
అప్పుడెప్పుడో దానవీరశూరకర్ణలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ఎన్టీఆర్. ఆ తర్వాత కమల్ హాసన్ భారతీయుడు, అభయ్, దశావతారం సినిమాల్లో విలనీగా అదరగొట్టేశాడు. ఇప్పుడు చియాన్ విక్రమ్ కూడా తన రాబోయే సినిమాలో తానే విలన్ గా నటించబోతున్నాడు. అయితే మామూలు విలనిజం కాదు. ఏకంగా హిజ్రా గెటప్ లో విలన్ గా అదరగొట్టడానికి సిద్ధమవుతున్నాడు. మొన్నటికి మొన్న కాంచన సినిమాలో లారెన్స్ హిజ్రా గెటప్ లో ఎవరూ ఊహించని రేంజ్ లో నటించాడు. ఇప్పుడు అంతకుమించిన విలనీ పండించాలనుకుంటున్న చియాన్.. అందుకు తగ్గట్టుగా తనను తాను మలచుకునే కార్యక్రమంలో పడ్డాడట. ఓ వైపు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. మరో వైపు ప్రతినాయకుడిగా పాత్రను పండించాలంటే.. అందుకు తగ్గట్టు మలుచుకోవాలిగా అంటున్నాడట తనను కలిసిన వారి దగ్గర.
గతంలో కొందరు హీరోలు ఒకే సినిమాలో హీరో కమ్ విలన్లుగా నటించారు. వాలి సినిమాలో అజిత్, హలో ప్రేమిస్తారాలో సాయిరాం శంకర్, జెండాపై కపిరాజులో నాని కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్లు చేశారు. అంతేకాదు సూర్య హీరోగా విక్రం దర్శకత్వంలో వస్తున్నా 24 లో కూడా సూర్య విలన్ గా చేస్తున్నాడు. అయితే విక్రం లా ఏకంగా హీరోనే హిజ్రా గెటప్ వేయాలనుకోవడం మాత్రం కొత్తే అంటున్నారు. ఇక హీరోయిన్ అంజలి కూడా ఓ సినిమాలో హిజ్రాలాగా నటిస్తోందంటూ రూమర్ వస్తుంది. అది ఇంకా కన్ఫాం కాలేదు. కానీ హిజ్రా గెటప్ గురించి కొత్తగా చెప్పుకుంటున్నా.. అప్పుడెప్పుడో నర్తనశాలలో.. లేడి అవతారంలో సినిమాను పండించాడు ఎన్టీఆర్. సినిమాలో ఎవరు హిజ్రా గెటప్ వేయాలన్నా.. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేంతగా నటించి చూపాడు. మరి విక్రం హిజ్రాకు ఇన్స్పిరేషన్ ఏమై ఉంటుందో ఆ హీరో నోరు విప్పితే కానీ బయటకు రాదు