సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో సినిమా గురించి చర్చించుకోడానికి వింత వింత ప్రచారాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమా మొదలైన నాటి నుండి సినిమా పూర్తయ్యి థియెటర్స్ లో సందడి చేసేంత వరకు ఒకటే హడావిడి. సినిమా టీజర్ రిలీజ్ అని.. సినిమా ట్రైలర్ రిలీజ్ అని.. ప్రేక్షకులు అబ్బాబ్బా ఏంటి ఈ గోలా అనేలా చేస్తున్నారు. అయితే ఇదంతా సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద ఓ అభిప్రాయాన్ని కలిగించడానికి దర్శక నిర్మాతలు పాటించే ఓ ఫార్ములా..
చిన్న సినిమానా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఈ ప్రచారం చేస్తున్నారు. చిన్న సినిమా అయినా సరే ఓ స్టార్ హీరోని పిలిచి అతనితో సినిమాకు సంబంధించిన టీజర్ కాని.. ట్రైలర్ కాని రిలీజ్ చేస్తున్నారు. ఇక స్టార్ హీరో రిలీజ్ చేశాడంటే దానికి తమ అభిమానుల సహకారం కూడా ఉంటుందని వారి ఆలోచన. ఏది ఏమైనా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టుతున్న టాలీవుడ్ లో ఇంకెన్ని సరికొత్త ప్రచార విధానాలు చూడాల్సి వస్తుందో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే వరకు సినిమాలో కాస్త విషయం ఉంది అంటే చాలు సినిమాను సూపర్ హిట్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. కొద్దిరోజుల క్రితం నుండి ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి అలానే దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల పద్దతిని మార్చుకుని ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ ఎప్పటిదాకా కొనసాగుతుందో తెలియదు కాని చిన్న సినిమా దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే సందర్భాలు కనపడుతున్నాయి.