విశాఖలో హ రైజ్ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాల నిర్మాణం ట్రెండ్‌గా మారుతోంది. ఇప్పటివరకూ 40, 50 అంతస్తుల నిర్మాణాలు హైదరాబాద్ లాంటి సిటీలకే అనుకునేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కంటే తక్కువేమీ కాదని విశాఖలో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటివరకూ విశాఖలో అతి ఎత్తు భవనం సీతమ్మధారలో ఉంది. ఆ భవనం ఎత్తు 35 అంతస్తులు.
ప్రస్తుతం మధురవాడలో 50 అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. నేవీ సిబ్బంది కోసం 41 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటుగా ఆర్కే బీచ్ సమీపంలో 34 అంతస్తుల హోటల్ నిర్మిస్తున్నారు. విశాఖలో ఎత్తయిన భవనాలు నిర్మాణం కాకపోవడానికి రక్షణ పరంగా ఉన్న సున్నితత్వమే కారణం. ఎయిర్ పోర్టు వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నా రక్షణశాఖ అధీనంలో ఉంటుంది. ఎత్తయిన భవనాల నిర్మాణానికి అనేక అనుమతులు రావడం కష్టంగా మారుతోంది.
ఇప్పుడు బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మరింత ఎత్తుగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా.. అపార్టుమెంట్లలో లగ్జరీ నిర్మాణలకు డిమాండ్ పెరుగుతోంది. విశాఖలో ఎంతో ఎత్తు నుంచి చూస్తే దూరంగా కనిపించే బీచ్ వ్యూ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి నిర్మాణాలు ఎత్తైన అపార్టుమెంట్ల ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే రానున్న రోజుల్లో విశాఖ మరింత ఎత్తుకు ఎదగనుంది.