నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ సంక్రాంతికి రిలీజ్ అయి అతని కెరీర్లోనే ఓ డిఫరెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ చెయ్యబోయే 100వ సినిమాపైనే అందరి దృష్టీ పడింది. తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా వుండాలని బాలకృష్ణ భావిస్తున్న విషయం తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చిత్రాన్ని రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ చిత్రం ద్వారా మోక్షజ్ఞను పరిచయం చెయ్యబోతున్నానని కూడా బాలకృష్ణ చెప్పాడు. ఈ చిత్రానికి సింగీతం దర్శకుడు కాదని, బాలకృష్ణ తనే డైరెక్ట్ చెయ్యబోతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇవేవీ కరెక్ట్ కాదని లేటెస్ట్గా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత సంవత్సరం ఆరంభంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ‘పటాస్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని రూపొందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు తెరపైకి వచ్చాడు. బాలయ్య 100వ సినిమాని అనిల డైరెక్ట్ చెయ్యబోతున్నాడట. అనిల్ ఒక కొత్త కాన్సెప్ట్ బాలకృష్ణకి వినిపించడం, అది బాలయ్యకు నచ్చడంతో 100వ సినిమా చేసే అవకాశం అనిల్‌కే ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రామారావుగారు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో వుందట. ఈ చిత్రాన్ని దిల్‌రాజు చాలా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి వుంది.