రెండు తెలుగు రాష్ట్రాల మద్య మొదలైన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వివాదం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణా రాష్ట్ర పరిస్థితులని ప్రతిబింబించేవిధంగా తమ అధికారులు ఎంతో కష్టపడి తయారుచేసి ఆన్ లైన్ ద్వారా కేంద్రానికి సమర్పిస్తున్న ఫైళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ కొడుతోందని తెలంగాణా ప్రభుత్వం పిర్యాదు చేసింది. దీనిపై కేంద్రానికి పిర్యాదు చేస్తూ ఒక లేఖ వ్రాయడమే కాకుండా సైబర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.
తెలంగాణా ప్రభుత్వ వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ద్వందంగా త్రోసిపుచ్చడమే కాకుండా ఈ వివాదానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చి తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని కోసం కేంద్రానికి ఆన్ లైన్ ద్వారా నివేదికలు సమర్పిస్తున్నా ఒక రాష్ట్రం సమర్పిస్తున్న నివేదికలని మరొక రాష్ట్రం చూసే అవకాశం లేదు. కానీ “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలు ఇవిగో..అది మా నివేదికలని కాపీ కొట్టింది అనడానికి ఆధారాలు ఇవిగో..” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన కొన్ని నివేదికల కాపీలని తెలంగాణా ప్రభుత్వం మీడియాకి విడుదల చేసింది.
“ఒకరి నివేదికలు మరొకరు చూసే అవకాశమే లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన ఆ నివేదికలు మీ చేతికి ఎలాగ వచ్చాయి?” అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వమే తమ ప్రభుత్వ వెబ్ సైట్ ని హ్యాకింగ్ చేసి ఆ నివేదికలని దొంగిలించి ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై జరిపిన ప్రాధమిక దర్యాప్తులో జూలై 2న తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్లోకి లాగ్ ఇన్ అయినట్లు కనుగొన్నారు. కానీ ప్రభుత్వం దానిని ఇంకా దృవీకరించలేదు. దీనిపై సైబర్ పోలీసుల చేత కానీ ఎథికల్ హ్యాకర్స్ చేత గానీ మరింత లోతుగా దర్యాప్తు చేయించి నిర్ధారించుకోవాలని నిర్ణయించింది.
ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం హ్యాకింగ్ కి పాల్పడి ఉంటే ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అది గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఉన్నతాధికారుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినందుకు ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన కేసులు ఇంకా అలాగే ఉన్నాయి.
అయితే దీనిలో మరో కోణం కూడా కనబడుతోంది. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం హ్యాకింగ్ చేయడం నిజమైతే, ఏపి ప్రభుత్వం కూడా హ్యాకింగ్ పాల్పడి ఉండవచ్చని అనుమానించవలసి వస్తోంది. ఎందుకంటే హ్యాకింగ్ చేస్తే తప్ప తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి సమర్పిస్తున్న నివేదికలని అది కాపీ కొట్టడం సాధ్యం కాదు. కానీ ఏపి ప్రభుత్వం అటువంటి పొరపాటు చేయకపోయుంటే, దానిపై ఆ విధంగా పిర్యాదులు చేసినందుకు తెలంగాణా ప్రభుత్వమే ఇబ్బందులలో పడకతప్పదు.