గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ లకు పోలీసుల సమక్షంలో మానసిక వైద్య నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారిరువురూ రాజీకి సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ భావిస్తున్న సమయంలో మళ్ళీ ఊహించని మలుపు తిరిగింది. మధుప్రియ తండ్రి పెద్ద మల్లేష్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని రామంతాపూర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ నయీం (30) అనే వ్యక్తిని తన అల్లుడు శ్రీకాంత్ గా పొరబడి దాడి చేసారు. ఆ దాడిలో నయీం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు మధుప్రియ తండ్రి మల్లేష్ మరో ముగ్గురు వ్యక్తులని మంగళవారం ఉదయం అరెస్ట్ చేసారు. ప్రస్తుతం వారి ముగ్గురిని పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. మరి కొద్దిసేపటిలో వారిని కోర్టు ముందు హాజరు పరచవచ్చునని తెలుస్తోంది.
అంతకు ముందు శ్రీకాంత్ పై కూడా మధుప్రియ బంధువులు దాడి చేయడంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను కూడా వారిపై పోలీసులకు పిర్యాదు చేసాడు. ఇప్పుడు ఈ ఘటనతో అతను తన అత్తమామలపై చేస్తున్న ఆరోపణలు నిజమని అనుమానించవలసి వస్తోంది. వారికి తమ కుమార్తె తనతో కాపురం చేయడం ఇష్టం లేదని అందుకే వాళ్ళు తమ కాపురంలో చిచ్చు పెడుతున్నారని, ఆ కారణంగానే తమ కాపురం రోడ్డున పడిందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మధుప్రియ తండ్రి మల్లేష్ తన అల్లుడు అనుకొని పొరపాటున వేరొక వ్యక్తిపై దాడి చేయడం గమనిస్తే, ఆయనకి తన అల్లుడిపై దాడి చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆయన తిరిగి తన అల్లుడు శ్రీకాంత్ వలన తనకు ప్రాణహాని ఉందని పోలీసులకి పిర్యాదు చేయడం విశేషం.
మధుప్రియ కష్టార్జితాన్ని స్వంతం చేసుకోవాలనే దురాశతోనే అందరూ ఈవిధంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యాభర్తలు రాజీకి సిద్దపడుతున్నప్పుడు వారి పెద్దలు ఈవిధంగా వ్యవహరిస్తుండటం చాలా విచారకరమే. కనుక పోలీసులు ముందు వారి పెద్దలకు కౌన్సలింగ్ ఇవ్వడం అవసరమనిపిస్తోంది.