హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఇవాళ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానికి రాసిన లేఖే రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పిందని అతని మద్దతుదారులు ఆరోపిస్తుండగా, ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కూడా తమకు లేఖ రాశారని స్మృతి ఇరాని ఇవాళ బయటపెట్టారు. వీహెచ్ 2014 నవంబర్‌లో రాసిన లేఖను కూడా మీడియాకు ప్రదర్శించారు.
రోహిత్ వ్యవహారంపై స్మృతి ఇరాని ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రోహిత్ మృతిపై వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇది దళితులు, దళితేతరులకు మధ్య గొడవ కాదని చెప్పారు. ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒక కేసు కూడా హైకోర్ట్‌లో ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై తాము ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ రేపు ఢిల్లీ చేరుకుంటుందని, వారి సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ పాలకమండలి గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయిందని గుర్తు చేశారు. విద్యార్థులు హాస్టల్‌ను ఖాళీ చేయాలని చెప్పిన వార్డెన్ దళితుడేనని చెప్పారు. రోహిత్ మృతి బాధాకరమని అన్నారు. సూసైడ్ నోట్లో అతను ఏ పేర్లనూ రాయలేదని గుర్తు చేశారు. దత్తాత్రేయ రాసిన లేఖ ఒక్కదానినే కాక వీహెచ్ రాసిన లేఖను కూడా ఆధారంగా చేసుకునే తాము యూనివర్సిటీకి లేఖలు రాశామని చెప్పారు.