ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి గాయపడటం, అప్పటికే దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి, కూతరు కలిసి చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇరువర్గాలతో మాట్లాడుతున్నారు.
దువ్వాడ శ్రీనుతో విడాకులకు ఒప్పుకున్న వాణి… తనకు రావాల్సిన ఆస్తులు, ఇల్లుపై కొన్ని కండిషన్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంటిని ఇచ్చేందుకు దువ్వాడ ఒప్పుకోవటం లేదన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆ ఇంటిపై తన వద్ద డబ్బు తీసుకున్నారని, ఆ బాకీ తీర్చాలంటూ పార్వతీశ్వరరావు సీన్ లోకి ఎంటరయ్యారు.
ఇంటిని చూపి దువ్వాడ తన వద్ద 60లక్షల అప్పు తీసుకున్నారని, అప్పు తీర్చేందుకు ఇచ్చిన చెక్కులు ఇంకా క్లియర్ చేయలేదని పార్వతీశ్వర్రావు ఆరోపిస్తున్నారు. తన బాకీ తీర్చకుంటే దువ్వాడ ఇంటిని తానే స్వాధీనం చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు.
ఆ ఇల్లు తన డబ్బుతో కట్టింది కాబట్టి తనకు ఇవ్వాలని ఇన్ని రోజులుగా దువ్వాడ వాణి పట్టుబడుతుండగా… ఇప్పుడు మరో వ్యక్తి రావటంతో సమస్య మరింత జఠిలం అయ్యేలా ఉంది.
అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనే తనను రప్పించారని… ఇల్లు ఇచ్చేందుకు ముందుకు రాకుండా ఇదో నాటకం అయి ఉంటుందని వాణి అనుమానిస్తున్నారు.