సీబీఐ అధికారులు నెల రోజులకుపై ఏదైనా కేసులో విచారణ జరిపారో లేదో కానీ… వైఎస్ వివేకా హత్య కేసులో మాత్రం.. జరుపుతూనే ఉన్నారు. రోజూ.. డ్రైవర్, వాచ్మెన్లను పిలిపించుకుంటున్నారు. ప్రతీ రోజూ వారేనా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు.. వివేకాతో సన్నిహిత సంబంధాలు.. వ్యాపార సంబంధాలు ఉన్న ఇతరుల్ని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అంతే తప్ప…అంతకు మించి ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. సీబీఐ అధికారుల తీరుపై కడపకు చెందిన సుబ్బారాయుడు అనే లాయర్.. కేంద్ర గ్రివెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ విచారణ ఏమీ జరగడం లేదని .. అంతా గూడుపుఠాణీ చేస్తున్నారన్న అర్థంలో ఆయన ఫిర్యాదు చేయడంతో… కలకలం రేగింది.
సీబీఐ సెంట్రల్ గ్రీవెన్స్ సెల్‌కు ఈ ఫిర్యాదు వెళ్లడంతో.. అక్కడ అధికారులు స్పందించారు. దర్యాప్తు అధికారులను పురోగతిపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆమె… పులివెందులలో పలువురు పోలీసు అధికారుల్ని కలిశారు. మళ్లీ చెప్పాలనుకున్నది చెప్పారు. అయితే అసలు లాయర్ సుబ్బారాయుడు రాసిన లేఖలో ఏముందో.. మాత్రం స్పష్టత లేదు. కానీ.. ఆ లేఖ దర్యాప్తులో కీలకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీబీఐ అధికారులు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో…పులివెందులలో కూడా… చర్చనీయాంశం అవుతోంది. బహిరంగ రహస్యమైన కేసును చేధించడానికి .. నెలలతరబడి సీబీఐ అధికారులు దర్యాప్తు చేయడం అంటే.. ఆ సంస్థ సామర్థ్యంపైనే అనుమానాలు ఏర్పడతాయని అంటున్నారు.
అయితే.. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో కానీ సీబీఐ అధికారులు మాత్రం ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్, వాచ్మెన్ చుట్టూనే వారు తిరుగుతున్నారు.. వారిని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి.. ఆ కేసును వారిదగ్గరే ఆపేస్తారేమోనన్న సెటైర్లు … పులివెందులలోనే వినిపిస్తున్నాయి. మొత్తానికి వివేకా హత్య కేసులో తమపై కూడా మచ్చ పడకుండా… సీబీఐ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.