కేసీఆర్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారిన మల్లన్న సాగర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎకరానికి 6 లక్షల రూపాయల పరిహారంతో అంతా సాఫీగా జరుగుతుందని అనుకుంటే అలా జరగడం లేదు. ఆ తర్వాత మళ్లీ కథ మొదటికొచ్చింది. భూములు ఇవ్వడానికి చాలా మంది రైతులు ఒప్పుకోవడం లేదు.
ప్రతిపక్షాలన్నీ పరిహారం విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ప్రాజెక్టు ప్లాన్ నే తప్పు పడుతోంది. అసలు ఈ రిజర్వాయర్ నిర్మాణమే అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెప్పారు. మెదక్ జిల్లా కొండపాక మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లిలో కాంగ్రెస్ నేతలు పర్యటించారు.
మర్రి శశిధర్ రెడ్డి, కోదండరెడ్డితో పాటు ప్రొపెసర్ పురుషోత్తం రెడ్డి ఆ గ్రామంలోని రైతులతో మాట్లాడారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఇంత పెద్ద జలాశయ నిర్మాణం ఎక్కడా జరగలేదన్నారు. అసలీ నిర్ణయమే సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వం కచ్చితంగా దీన్ని నిర్మాంచని భావిస్తే నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎవరో కొందరి నిర్ణయం మేరకు ఇష్టం వచ్చినట్టు నిర్మాణం చేయడం, దానికోసం రైతుల భూములు తీసుకోవడం సబబు కాదన్నారు.
హర్యానాలో అనుసరిస్తున్న ఒక విధానాన్ని వారు వివరించారు. జలాశయాన్ని నిర్మించకుండా సాగునీటిని సరఫరా చేయడం సాధ్యమని హర్యానాలో రుజువు చేస్తున్నారని చెప్పారు. చెప్పడమే కాదు, దీనికి సంబంధించిన షార్ట్ ఫిలింను కూడా రైతులకు ఎల్ ఇ డి టీవీలో ప్రదర్శించారు. ఇది రైతులను ఆలోచింపజేసింది. నిజంగా జలాశయ నిర్మాణం లేకుండా సాగునీరు అందించడానికి అవకాశం ఉంటే మరి రైతుల భూములను తీసుకుని వాళ్లను నిరాశ్రయులను చేయడం ఎందుకు? జలాశయం పేరుతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ఎందుకు? కచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే.
ఒకవేళ ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వం భావిస్తే, నిపుణులతో చర్చించాలి. ఇది సరైన విధానం కాదని నిపుణులే తేల్చాలి. మరి హర్యానాలో ఎలా అమలవుతోందనే ప్రశ్నకు కూడా జవాబివ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ నిర్ణయించారనో, మరో కారణం వల్లనో ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రజల ధనం ఒక్క పైసా కూడా వృథా కాకుండా కాపలా కాయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేతలు చెప్పిన విషయాలను కొట్టిపారేయకుండా, ఆలోచించడం తప్పనిసరి.