తనని ప్రేమ, పెళ్లి పేరుతో హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ తరుణ్ రోజు రోజుకీ కూరుకుపోతున్నట్టు అనిపిస్తోంది. లావణ్య చాలా చాకచక్యంగా ఒక్కో ఆధారాన్ని పోలీసులకు అప్పగిస్తున్న వైనం చూస్తుంటే రాజ్ తరుణ్ చుట్టూ బలమైన ఉచ్చు బిగుస్తున్నట్టు అర్ధమవుతోంది. తొలుత తనని రహస్యంగా పెళ్లి చేసుకొని, పదకొండేళ్లు కాపురం చేశాక, ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య, ఆ తరవాత మాల్వీ మల్హోత్రా పేరు బయటపెట్టింది. ఈ హీరోయిన్‌తో రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని, అందుకే తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని మరో బాంబు పేల్చింది. అంతేకాదు.. రాజ్ తరుణ్ కు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయని కొంతమంది పేర్లు కూడా బాహాటంగానే చెప్పేసింది.
ఇప్పుడు అబార్షన్ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చింది. రాజ్ తరుణ్ వల్ల తాను రెండుసార్లు అబార్షన్ చేయించుకొన్నానని, ఆధారాలతో సహా పోలీసులకు పమర్పించింది. బ్యాంకు ఎకౌంట్లలో నామినీగా తన పేరు పెట్టుకొన్నాడని, రాజ్ తరుణ్‌తో పలుమార్లు విదేశాలకు వెళ్లిన విషయాల్ని కూడా సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అప్పగించింది. ఈ కేసులోకి కల్యాణ్ దిలీప్ సుంకర రావడంతో ఈ ఇష్యూ మరింత రైజ్ అయ్యింది. పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుకోవాలని, కోర్టుకు వెళ్లితే గనుక రాజ్ తరుణ్ అడ్డంగా ఇరుక్కోవాల్సి ఉంటుందని, ఈగోకు పోకుండా, చేసిన తప్పుల్ని ఒప్పుకొని, లావణ్యని భార్యగా ఒప్పుకోవాలని దిలీప్ సుంకర గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు.. లావణ్య – రాజ్ తరుణ్‌ల మధ్య పెళ్లయ్యిందని, ఇద్దరూ కలసి కాపురం చేశారు అనడానికి ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలే సాక్షులని, ఒకవేళ రాజ్ తరుణ్ గనుక ముద్దాయిగా కోర్టులో నిలబడితే, అప్పట్లో రాజ్‌తరుణ్, లావణ్యలకు సపోర్ట్ చేసినవాళ్లు కూడా కోర్టుకు రావాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారి చేశాడు. రాజ్ తరుణ్ ఒక్కడితో వదలకుండా మాల్వీ మల్హోత్రాపై కూడా లావణ్య ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరింత రసవత్తరంగా మారింది. అయితే రాజ్‌తరుణ్ లావణ్యకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడని, లావణ్యకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు సంపాదించే పని లో ఉన్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.