జగన్ రెడ్డి తెచ్చి పెట్టిన నిరర్థక వ్యవస్థల్లో ఒకటి అయిన సచివాలయవ్యవస్థలో ఉద్యోగులతో పని చేయించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా పని విభజన చేయనున్నారు. 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగుర్ని ఉంచాలని నిర్ణయించారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉండేలా కొత్తగా నిర్ణయం తీసుకున్నారు.
2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉండేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక మందికి పని లేదు. నిజానికి వారు చేయాల్సిన పనులన్నీ వివిధ ప్రభుత్వ శాఖలు చేసేవే. అయినా ఉద్యోగుల్ని నియమించి వారికి పనేమీ లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. ఎవరికీ సరైన వర్క్ చార్ట్ లేదు. ఈ కారణంగా వారు తమ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న గందరోగళంలో ఉండేవారు. చివరికి ప్రభుత్వంఆ వ్యవస్థను సంస్కరించి.. అందరితో పని చేయించుకోవాలని నిర్ణయించి కీలక నిర్ణయాలు తీసుకుంది.