ఈ సంక్రాంతికి నిజమైన హీరోగా నిలిచిన వ్యక్తి.. బుర్రా సాయి మాధవ్. అటు చిరంజీవి 150వ చిత్రానికీ, ఇటు బాలకృష్ణ వందో సినిమాకీ మాటలు రాసిన అరుదైన ఘనత సాధించాడు. రెండు సినిమాలూ కమర్షియల్గా హిట్ అయ్యాయి. గౌతమి పుత్ర శాతకర్ణి సంభాషణలైతే మార్మోగిపోతున్నాయి. ఈ సినిమాతో మరో పది మెట్లు ఎక్కేశాడు బుర్రా. ఇప్పుడు బుర్రాని వెదుక్కొంటూ భారీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో కాటమరాయుడు కూడా చేరిపోయింది. పవన్ కల్యాణ్ – డాలీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడీ స్క్రిప్టుని సాయిమాధవ్ చేతిలో పెట్టాడు డాలీ. కీలకమైన సన్నివేశాలకు సంభాషణలు అందించడానికి బుర్రా రంగ ప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఎమోషనల్ సన్నివేశాలు రాయడంలో బుర్రా దిట్ట. కాటమరాయుడులోనూ అలాంటి సీన్లు చాలా ఉన్నాయట. అవన్నీ బుర్రా చేతే రాయించాలని పవన్ భావించడంతో ఈ ప్రాజెక్టులోని అనూహ్యంగా బుర్రా రంగ ప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటికి తీసిన సన్నివేశాల్ని సాయిమాధవ్ చేత రీ రైట్ చేయించాలని భావించినా…. ఆ ప్రతిపాదనని విరమించుకొన్నట్టు సమాచారం. మొత్తానికి ఓ స్టార్ రైటర్… కాటమరాయుడు ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది వరకు పవన్ నటించిన గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు పనిచేశాడు సాయిమాధవ్. గోపాల గోపాలలోని సంభాషణలు పవన్నీ ఆకట్టుకొన్నాయి. ఆ పరిచయంతోనే.. బుర్రాని పిలిపించినట్టు తెలుస్తోంది.