ఏడాదిలో చివరి రోజు ! కొద్ది గంటలు గడిస్తే కొత్త ఏడాదిలో అడుగు పెడతాం…! ఏడాది అంతా ఏం చేశామో అవలోకన చేసుకుని.,.. వచ్చే ఏడాది ఏం చేయాలో.. ఏం చేయకూడదో నిర్ణయించుకోవాల్సిన సమయం. ఏడాది మొత్తంగా వ్యక్తిగత జీవితంలో తప్పటడుగులు వేశామో… ఆర్థిక జీవితంలో అప్పుటడుగులు… ఆరోగ్య జీవనంలో ఆస్పత్రుల వైపు అడుగేశామా .. సేఫ్‌గానే లైఫ్‌స్టైల్‌ను మెయిన్‌టెయిన్ చేశామా అని లెక్కలేసుకుని సమీక్ష చేసుకోవాల్సిన సమయం.
జీవితం చాలా చిన్నదే..కానీ ఎంత కాలం బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే !
జీవితం చాలా చిన్నదని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ చిన్నదో పెద్దదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అందరి జీవితం ఒక్కటే. బిజీగా ఉండేవారికి వేగంగా గడిచిపోతుంది.. ఖాళీగా ఉండే వారికి భారంగా ఉంటుంది. కానీ వాచీలో ముల్లు మాత్రం ఒకటే వేగంగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా కరిగిపోయిన కాలం ఎప్పుడూ అపురూపమే. ఎందుకంటే అది ఎప్పటికీ తిరిగి రాదు. కానీ ఆ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నామన్నదానిపైనే మన సమయానికి మనం ఇచ్చే విలువ ఆధారపడి ఉంటుంది. ఆ విలువ ఆధారంగానే మన జీవితానికి విలువ పెరుగుతుంది. మనం అనుకున్న లక్ష్యాల వైపు తీసుకెళ్తుంది. అల్లూరి సీతారామరాజు ఎంత కాలం జీవించారు..? కేవలం 27 ఏళ్లు. భగత్ సింగ్ ఎన్నేళ్లకు అమరుడయ్యాడు.. కేవలం 24 ఏళ్లే ఆయన భౌతికంగా జీవించారు. ఇక చేగువెరా జీవించింది 39 ఏళ్లు మాత్రమే. నిజానికి వారు చనిపోయారని చెప్పడం కష్టం. వారు ఇప్పటికీ బతికి ఉన్నారు. అందుకే మనం అందరం గుర్తు చేసుకుంటున్నారు. వారికి కూడా జీవితం చాలా చిన్నదే. కానీ ఆ జీవితాన్ని ఎలా అనుకున్నారో ఆలా నడిపించుకుని ఇప్పటికీ జీవించి ఉన్నారు. వీరు విప్లవ వీరులు కాబట్టి .. తాము కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఇలాగే ఇతర రంగాల్లోనూ ఎంతో మంది చిన్న జీవితంలోనూ అతి పెద్ద విజయాలు సాధించారు. వారి వారి రంగాల్లో భౌతికంగా లేకపోయినా… ఇంకా జీవించి ఉన్నారు. వీరందరూ చెప్పేదేమిటంటే.. కరిగిపోతున్న కాలాన్ని ఎవరూ ఆపలేరు.. కానీ ఆ కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ఎక్కువ కాలం జీవిస్తారన్నమాట.
కరిగిపోయిన ఏ క్షణమూ తిరిగిరాదు.. ఇది గుర్తుంచుకంటే చాలు !
కొంత మంది కొన్ని తేదీలను ప్రీషియస్ అని.. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఆ తేదీ వస్తుందని మెసెజులు పెడుతూ ఉంటారు. నిజానికి ఆ ఒక్క రోజో.. ఆ ఒక్క నిమిషమో.. ఆ ఒక్క గంటో ప్రీషియస్ కాదు. ఏ క్షణమైనా కరిగిపోతే తిరిగి రాదు. అందుకే ప్రతీ క్షణం ముఖ్యమే. ఫలానా క్షణం ముఖ్యమని చెప్పుకుని టైం పాస్ చేయడం… ఆ కాలాన్ని అవమానించడమే. మన జీవిత కాలాన్ని వృధా చేసుకోవడమే. అందుకే ఎవరైనా కాలంతో పోటీ పడాలి.. అనుకున్నది సాధించే దిశగా నిరంతరం ప్రయత్నించాలి. అయితే ఇక్కడ అసలు ముందుగా ఏం సాదించాలన్నది కూడా నిర్ణయించుకోవాలి. ఏమి సాధించాలి ? డబ్బేగా అనేది ఎక్కువ మంది నోటి నుంచి వచ్చే సమాధానం. ఆ డబ్బు కోసం పరుగులు పెడతాం.. ఆ డబ్బు కోసం ఎంత మూర్ఖత్వానికైనా దిగజారతాం.. కానీ చివరికి ఆ డబ్బు వల్ల అన్నీ రావని తెలుసుకుంటారు. కానీ ఆ విషయం ముందే తెలుసుకుంటే స్పష్టమైన లక్ష్యం ఎదురుగా వస్తుంది.
డబ్బే లక్ష్యం అనుకుంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నట్లే లెక్క !
కొద్ది రోజుల కిందట చెన్నైలో వరదలు వచ్చాయి. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దగ్గర చేతిలో కావాల్సినంత క్యాష్ ఉంది. బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఉన్నాయి. ఇంకా కావాలంటే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కానీ అతను ఎంత ఇస్తానన్నా.. కాస్త ఫుడ్ పెట్టే వారు అతనికి కనిపించలేదు. దొరకలేదు. చివరికి డబ్బుతో అన్నీ దొరకవు అని అప్పుడు అతను రియలైజ్ అయ్యాడు. అనుభవమైతేనే కానీ తత్వం బోధపడదన్నట్లుగా అతను నేర్చుకున్నాడు. కానీ అలాంటి అనుభవాలు ఎదురయ్యే సరికి జీవితంలో చాలా భాగం కోల్పోతోంది నేటి యువత. నిజంగా డబ్బుతోనే అన్నీ వస్తాయనుకుంటే.. కోట్లు ఉన్న వారు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ? డబ్బు చింతే లేని వారు ఎందుకు పిచ్చి వాళ్లుగా మారుతున్నారు ?. జీవితం అంటే డబ్బు కాదు.. అంతకు మించి ఉన్నదని గుర్తుంచుకోవాలి. అది ఆనందం. హ్యాపీ లైఫ్. తాజ్ మహల్‌ను చూడాలనుకోవాలి.. కానీ కావాలనుకోకూడదు. అలాగే హీరోయిన్లు అయినా.. మరెవరైనా అందాల్ని చూసి ఆస్వాదించాలి.. కానీ కావాలని కోరుకోకూడదు. ఇలాంటి ఇహ.. పర సుఖాల విషయంలో మంచేదో.. చెడేదో … నిర్ణయించుకునే మెచ్యూరిటీని సాధిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. డబ్బు కోసం పరుగులు పెట్టి అవసరం లేని దాన్ని అందుకోవడానికి అపసోపాలు పడితంటాలు పడితే చివరికి మిగిలేది ఆయాసమే.
డబ్బుకు గౌరవం ఇవ్వాలి… !
అలా అని మనీకి ప్రాధాన్యత ఇవ్వకూడదని కాదు. మనీ అంటే దేవుడు. ఆ దేవుడికి ఎంత విలువ ఇస్తామో మనీకి అంత విలువ ఇవ్వాలి. మన జీవితంలో ప్రతీ కీలకమైన మలుపుకు మనీనే కారణం అవుతుంది. అతి ఆత్మీయుల బంధాలను నిలపడానికి.. బంధుత్వాలను చెడగొట్టడానికి.. చివరికి మీ జీవితం మీరు అనుకున్నట్లుగా గడపడానికి కూడా మనీనే అవసరం అవుతుంది. అందుకే మనీకి దేవుడికి ఇచ్చినంత ప్రాధాన్యం ఇవ్వాలి. అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆ మనీనే సర్వస్వం అంటూ జీవితాన్ని దానికే అంకితం చేయకూడదు. “డబ్బులే జీవితం కాదు.. కానీ డబ్బు లేకుండా జీవితం ఉండదు”. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఎంతో గొప్పగా లైఫ్ లీడ్ చేయవచ్చు. ఇక్కడ గొప్పగా అంటే.. కార్లు , బంగళాలు.. బ్రాడెండ్ షర్టులు.. మాల్స్‌లో షాపింగ్‌లు.. పర్యటనలు.. కాదు.. కేవలం ఆనందం అనే కొలమానమే అసలు గొప్ప. అదే సమయంలో నువ్ ఎంత పని చేస్తున్నావో .. దానికి తగ్గ సంపాదన వస్తుందని నువ్ శాటిస్ ఫై కావాలి. అప్పుడే పనికి.. మనీకి విలువ ఇచ్చినట్లు. ఉచితంగా పని చేసినా.. ఏ పని చేయకుండా డబ్బు తీసుకున్నా.. అది పతనానికి నాందే అవుతుంది. దాన్ని అర్థం చేసుకున్న వారి లైఫ్ అత్యంత ప్రశాంతంగా ఉంటుంది.
ఇతరుల జీవితానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోండి !
గత ఏడాది కాలంలో మన జీవితంలో.. మన చుట్టుపక్కల వారి జీవితంలో… మన చుట్టూ ఊళ్లో.. నగరంలో.. ఆఫీసులో.. బయట.. ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నీ మనకు తెలియకపోవచ్చు. కొన్ని తెలుస్తాయి. అలా తెలిసిన వాటి నుంచి మన లైఫ్‌కి అవసరమైన వాటిని మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. నిజం చెప్పాలంటే మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం.. వేరే వ్యక్తులు ఆ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఎలా అధిగమించారనేదాన్ని బట్టి మనం తెలుసుకునే దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం.. అవగాహన పెంచుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఈ విషయంలో ఎంత బాగా మనం మనల్ని తీర్చిదిద్దుకుంటున్నామన్నదానిపైనే లైఫ్ ఎంత స్మూత్‌గా వెళ్తుదన్నది ఆదారపడి ఉంటుంది.
సంబంధం లేని అంశాల్లో భావోగ్వేదాలు వద్దు.. కుటుంబం కోసం స్పందించండి !
జీవితంలో భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు సినిమా తారల కోసమో… రాజకీయ నేతల కోసం.. రాజకీయ పార్టీల కోసమో…కులాల కోసమో.. మతాల కోసమో.. ప్రాంతాల కోసమో అసలు వాడకుండి. ఈ ప్రిన్సిపల్‌ను ఖచ్చితంగా పాటిస్తే ఎన్నో సమస్యలను సులువుగా అధిగమిస్తారు. నేటి సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా పేరుతో మన మానసిక ఆరోగ్యాన్ని కలుషితం చేసేందుకు ప్రతీ క్షణం కొంత మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి నిరంతరం జరిగే దాడుల నుంచి మనల్ని మనం నిగ్రహంగా ఉంచుకోవడం అంత తేలిక కాదు. కానీ ఉంచుకోవడంలోనే అసలైన విజయం ఉంటుంది. పైన చెప్పుకున్నవి కొంత మంది స్వార్థ పరులు తమ లక్ష్యాలను సాధించడానికి అనేక లక్షల మంది జీవితాలను పణంగా పెట్టే సంఘటనలు. అలాంటి లక్షల మంది జీవితాల్లో మీది ఒకటి కాకుండా ఉండాలంటే.. ఆ భావోద్వేగాలన్నింటినీ పక్కన పెట్టేయాలి. ఆసక్తి ఉంటే చూసి తెలుసుకోవాలి… అంతే కానీ ఇతరులతో వాదనలు పెట్టుకోవడం.. మన జీవితాల్లో మార్పులు తేచ్చేలా సంబంధం లేని వాటి గురించి నిర్ణయం తీసుకోవడం మూర్ఖత్వం. ఎంతో మంది చదువుకున్న వారు.. జీవితంపై అవగాహన ఉన్నవారు చేస్తున్న ప్రధానమైన తప్పు.. ఇలాంటి చోటే ఉంది. ఏదైనా స్పందించాల్సి వస్తే అది కుటుంబం కోసమే తప్ప.. సంబంధం లేని అంశాల్లో ఉండకూడదని గుర్తు పెట్టుకోండి.
చివరికి ఒక్కటి మాత్రం నిజం.. మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. మీ సమయం మీ గుప్పిట్లో ఉంటుంది. కరిగిపోయిన క్షణం తక్షణం జ్ఞాపకంగా మారుతుంది. అది ఎప్పటికీ తిరిగి రాదు. అయ్యో అలా చేసి ఉంటే బాగుండేది అని మీరు అనుకున్నా ఒక్క క్షణం వేస్ట్ చేసినట్లే అవుతుంది. అందుకే జరిగిపోయిన వాటి గురించి మర్చిపోయి.. వాస్తవంలో బతకండి. సమయాన్ని.. డబ్బును… గౌరవించండి. ఉన్నత స్థానానికి ఎదగండి. ఎంత కాలం జీవించి ఉండాలో మీరే నిర్ణయించుకోండి…!
అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ !