ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. మరో ఏడాది కాలంలో కలసిపోయి జ్ఞాపకాలుగా మారిపోయింది. నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలను మన ముందు పెట్టిపోయింది. అంతా హ్యాపీ న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కానీ.. అలా చెప్పుకున్నంత మాత్రాన… ఏడాదిలో మొదటి రోజు హ్యాపీగా ఉన్నంత మాత్రాన ఏడాది మొత్తం హ్యాపీగా ఉండరు. అలా ఉండాలంటే అన్నీ మార్చుకోవాలి. మనం ఎలా మారాలనుకుంటున్నామో అలా మారి తీరాలి.
కొత్త ఏడాదికి ప్రత్యేకత లేదు. కాలం ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటుంది. ప్రతీ క్షణం ఓ క్షణం అయిపోతూ ఉంటుంది. ఏడాదికి ఉన్నంత విలువ ఆ క్షణానికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేం. అందుకే ప్రతీక్షణం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. డేట్ మారినంత మాత్రాన అన్నీ మారిపోతాయని ఆశపడిపోకూడదు. ముందు మారాలని.. మార్చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుని ఆ ప్రకారం పని చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.
కాలమే చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నది నిజం. అయితే అది మన ప్రయత్నాలతోనే అన్న సంగతి మర్చిపోకూడదు. గెలుపు పొందే వరకూ పోరాటం చేయాలి. అనుకున్న మార్పు సాధించే వరకూ ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే కాలం బలమైనదని నిరూపితమవుతుంది. అంతే కాని దానంతటకు అది జరిగిపోదన్న సంగతిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
హ్యాపీ న్యూ ఇయర్