సిరీస్ విజేతని నిర్దేశించే చివరి వన్డేలో భారత్ విశ్వరూపం చూపించింది. ఏకంగా 190 పరుగుల తేడాతో న్యూజీలాండ్‌ని చిత్తు చేసింది. 5 వన్డేల సిరీస్‌ని 3-2 తేడాతో జేజిక్కించుకొంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 269 పరుగులు చేసింది. గత నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మ (70) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొహ్లి (65), ధోని (41) పరుగులతో రాణించారు. అనంతరం 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చివరి 7 వికెట్లను కేవలం 16 పరుగుల తేడాతో చేజార్చుకొంది కివీస్. పట్టుమని పాతిక ఓవర్లు కూడా ఆడకుండా చాప చుట్టేసింది. భారత్‌పై కివీస్‌కి ఇదే అత్యల్ప స్కోరు. పాతిక ఓవర్లలోపు ఆలౌట్ అవ్వడం కూడా ఇదే తొలిసారి. భారత బౌలర్లలో మిశ్రా తన మాయాజాలం చూపించాడు. ఆరు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకొన్నాడు. మిశ్రా బౌలింగ్ ముందు కివీస్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. పిచ్ స్పిన్నర్లకు అంతంత మాత్రమే సహకరిస్తున్నా… అద్భుతమైన బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. అక్షర్ పటేల్‌కి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ రెండూ మిశ్రాకే దక్కాయి. టెస్టు సిరీస్‌ని కూడా భారత్ జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే.