హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతిపై జాతి మొత్తం ఆవేదన చెందుతోంది…నిజమే. ఒక అద్భుతమైన వ్యక్తి, దార్శనికుడు, నిష్కళంక దేశభక్తుడు, గొప్ప శాస్త్రజ్ఞుడు చనిపోవటంపై అందరికీ బాధ కలిగినమాట వాస్తవమే. అయితే నిన్నసాయంత్రంనుంచి విషాదసంగీతం పెట్టి అదేపనిగా ఆయనకు సంబంధించిన విషాద కార్యక్రమాలతో, ప్రసారాలతో ఊదరగొట్టటం టీవీ ఛానల్స్‌కు సమంజసమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే దానర్థం ఇప్పుడు వినోద కార్యక్రమాలను చూపాలనికాదు. నిజానికి ఎవరికి వారు తమ తమ విధులను నిర్వర్తించటమే తనకు సరైన నివాళి అర్పించటమని కలామే ఒక సందర్భంలో అన్నట్లు చెబుతున్నారు. తాను చనిపోతే సెలవు ఇవ్వకూడదని, అదనంగా ఒకరోజు పనిచేయాలని కలామ్ అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ చెప్పారు. అదనంగా పనిచేయకపోయినా, ఎవరికి వారు తమ పని సరిగా నిర్వర్తిస్తే అదే ఆయనకు నివాళి. న్యూస్ టీవీ ఛానల్స్ కార్యాలయాలలో సాధారణంగా ఏదైనా లైవ్ కార్యక్రమముంటే సిబ్బంది పండగ చేసుకుంటారు. లైవ్ కనెక్షన్ ఇచ్చేసి డెస్క్లోనివారు, పీసీఆర్వారు, యాంకర్లు, కెమేరా మేన్లు రిలాక్స్ అయిపోతుంటారు. అందులో ఇలాంటి ప్రముఖులు చనిపోతే ఇక చెప్పేదేముంది. వారికి కావలిసినంత రిలాక్సేషన్. వీక్షకులకు డిప్రెషన్. కలామ్ గురించిన కార్యక్రమాలు ఒకరకంగా ఫరవాలేదు. టాలీవుడ్లో ఎవరైనా చనిపోవటం ఆలస్యం ఇక ఆ రోజంతా టీవీ వ్యూయర్స్కూడా ఏడవాల్సిందే.
2009 సంవత్సరలో వైఎస్ హెలికాప్టర్ ఆచూకీ లేకుండా పోయినప్పుడు, ఆయన మరణవార్త తెలిసిన తర్వాత వరసగా దాదాపు మూడురోజులు టీవీ ఛానల్స్ ఊదరగొట్టిన ప్రభావంతో అనేకమంది చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెలు బలహీనంగా ఉన్నవారు, తమకు గుండెజబ్బు ఉన్నట్లు తెలియని వారు అదేపనిగా ఆ ప్రోగ్రామ్‌లు చూడటంతో కుంగిపోయి చనిపోయారని వైద్యులు తర్వాత తేల్చిన సంగతి, ఆ పాపంలో టీవీ ఛానల్స్ వాటాగురించి సోషల్ మీడియాలో పెద్దచర్చ జరిగిన సంగతి తెలిసిందే. న్యూస్ టీవీ ఛానల్స్…తెలుగే కాదు జాతీయ ఛానల్స్ కూడా – వేలంవెర్రిగా పోలోమని అందరూ ఒకే కార్యక్రమాన్ని చూపిస్తూ భావదారిద్ర్యంతో కునారిల్లటంకాకుండా మంచి, ఆలోచింపజేసే, సృజనాత్మక కార్యక్రమాలను చూపితే వీక్షకులను ఎడ్యుకేట్ చేసినట్లవుతుంది.