తెలుగునాట న్యూస్ పేపర్ల సైజ్ రాను రాను చిక్కిపోతోంది. అది సర్క్యూలేషన్లో మాత్రమే కాదు… పేజీల సంఖ్యలో కూడా. తరం మారుతోంది. పాఠకుల అభిరుచి మారుతోంది. క్షణక్షణం అప్ డేట్స్ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. తర్వాతి రోజు ఉదయం వచ్చే న్యూస్ పేపర్ చదవాలంటే.. చాలా ఓపిక ఉండాలి. కొనాలంటే.. ఇంకా అంత కంటే ఎక్కువ ఓపిక ఉండాలి. ఆ పరిస్థితి రాను రాను తగ్గిపోతోంది. ఫలితంగా.. సర్క్యూలేషన్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రధాన పత్రిక చందాలు.. నెలవారీగా తగ్గడమే కానీ.. పెరగడం ఉండటం లేదు. ఈ కారణంగా.. పత్రికలన్నీ.. సంస్కరణ బాటలో ఉన్నాయి. అందులో మొదటి సంస్కరణ.. పేజీల సంఖ్యను తగ్గించడం.
ఈనాడు దినపత్రిక పేజీలు కొద్ది రోజుల క్రితం వరకూ పద్దెనిమిది పేజీలు ఉండేవి. సహజంగా.. ఈనాడులో ప్రకటనలు ఎక్కువ కాబట్టి.. ఎక్కువ వార్తల్ని కవర్ చేయడానికి.. ఎక్కువ పేజీలు ముద్రించేవారు. కానీ ఇప్పుడు.. ఎన్ని ప్రకటనలు ఉన్నప్పటికీ.. మొత్తం పేజీలను 14కి మించనీయడం లేదు. సాక్షి పత్రిక కూడా అదే బాట.. ఆ పత్రిక కూడా పధ్నాలుగు పేజీలే లిమిట్ గా పెట్టుకుంది. ఆంధ్రజ్యోతి ఒక్కో సారి పన్నెండు పేజీలకే పరిమితమవువుతోంది. తెలంగాణలో నమస్తే తెలంగాణ, వెలుగు లాంటి పత్రికలు కూడా.. పేజీలను కట్టడి చేసుకున్నాయి. కొన్ని పత్రికలు పది పేజీలకే పరిమితమయ్యాయి.
సర్క్యూలేషన్లో అగ్రశ్రేణి పత్రికగా ఉన్న ఈనాడు దినపత్రిక సర్క్యూలేషన్.. క్రితం సారి అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తగ్గిపోయింది. భారీగా కాదు కానీ.. తగ్గిపోయిందన్నది వాస్తవం. ఎన్నికల వేడి ఉండబట్టి… ఆ కొద్దిగా తగ్గుదల.. లేకపోతే.. ఇంకా ఎక్కువ తగ్గుదల నమోదయ్యేది. ఆంధ్రజ్యోతితో పాటు ఇతర పత్రికలదీ అదే పరిస్థితి. సాక్షి యాజమాన్యం.. ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి. ప్రభుత్వం తరపున కొనిపించే కాపీలతో.. కాస్త పెరుగుదల కనిపించింది. కానీ వాస్తవంగా.. పాఠకులు కొనే వారి సంఖ్య భారీ పతనం అయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు న్యూస్ పేపర్ … సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కనుమరుగైన ల్యాండ్ లైన్ లాగా అయిపోయే పరిస్థితి ఖాయమని అర్థం చేసుకోవచ్చు. ఈ పతనం.. ఎంత వేగంగా ఉంటే.. ఆ పరిస్థితి అంతే వేగంగా వస్తుంది.