మీడియాలో మునిగితేలే వ్యక్తిగా, దానికి ఒక ప్రతినిధిగా వుండే నాలాటి వారు కూడా భరించలేని పరిస్థితి కొన్ని సార్లు ఇబ్బంది అనిపిస్తుంది. మధుప్రియ వివాహంలో వివాదం, చేసుకున్నవారి దౌర్జన్యంపై ఫిర్యాదులు ఎంతైనా బాధాకరం. చిన్నతనంలోనే గాయనిగా అది కూడా ఆడపిల్ల పాటతో అందరినీ ఆకట్టుకున్న ఆ అమ్మాయి బాధను అందరూ పంచుకున్నారు. ఛానళ్లు కూడా. అయితే ఒక అగ్రశ్రేణి ఛానల్ తరపున వెళ్లిన రిపోర్టర్ బాధల్లోని ఆ యువతిని వదిలిపెట్టకుండా వెంటాడ్డం చాలా వెగటనిపించింది. ఏదో విధంగా ఆమెను ఉద్వేగానికి గురి చేయాలనో లేక ఆవేశంగా మాట్లాడించాలనో అర్థం లేకుంగా సాగదీసిందా విలేకరి. ఆఖరుకు ఈ బాధలపై పాట పాడమని అడగడంతో నిర్ఘాంతపోయారు ప్రేక్షకులు. అయితే ఆ అమ్మాయి మాత్రం ఓపిక లేదక్కా అంటూ వెళ్లిపోయింది. బాధల్లో వున్నవారిపై ప్రజల సానుభూతి పెంచాలంటే ముందు మీడియా ప్రతినిధులకు సానుభూతి సందర్భశుద్ధి వుండాలి. లేకపోతే శోకిస్తున్న వారిని మీ మనోభావాలు ఎలా వున్నాయి అని అడుగుతుంటారు. వాళ్లకు తెలియదని తప్పుకుంటే సరిపోదు- చెప్పిపంపించడం, నేర్పించడం మన బాధ్యత. ఇప్పుడా అమ్మాయి సమస్య పరిష్కారంఅయిందంటున్నారు, మంచిదే. కాని అప్రమత్తంగానే వుండాలి. తప్పదు.