Newsense web series review
ప్రజాస్వామ్యంలో మీడియా శక్తి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. వ్యవస్థని మార్చగలిగే సత్తా.. మీడియాకు ఉంది. ప్రభుత్వాల్ని కూల్చగలిగి, దిశానిర్దేశం చేయగల సామర్థ్యం మీడియాకు ఉంది. అందుకే ఫోర్త్ ఎస్టేట్ అయ్యింది. అయితే మీడియా తన పని తాను సక్రమంగా చేస్తోందా? సామాన్యుడి సమస్య గొంతుని నిజంగానరే వినిపిస్తోందా? ప్రలోభాలకు లొంగి.. భ్రష్టుపట్టుకుపోయిందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. న్యూస్ కాస్త.. న్యూసెన్స్ గా మారి, నాన్సెన్స్ సృష్టిస్తున్న వైనాలు మనం కథలు కథలుగా చెప్పుకొంటూనే ఉన్నాం. వాటి చుట్టూ సినిమాలూ వచ్చాయి. ఈసారి ఈ న్యూసెన్స్ చూపించే బాధ్యత ఓ వెబ్ సిరీస్ భుజాన ఎత్తుకొంది. `న్యూసెన్స్` పేరుతో.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ టీజర్, ట్రైలర్.. ఆసక్తిని రేకెత్తించాయి. మీడియాలో ప్రబలిన అవినీతిని ఈ సిరీస్ ఎండగడుతోందన్న విషయం… ప్రచార చిత్రాలతోనే అర్థమైంది. మరి… ఈ న్యూసెన్స్‌ని… ఈ వెబ్ సిరీస్ ఎంత వరకూ క్యాప్చర్ చేయగలిగింది? ఇందులో అయినా నిజాలు చూపించారా, నిజాయతీగా ఉన్నారా?
చిత్తూరు జిల్లా మదన పల్లిలో జరిగే కథ ఇది. అక్కడి ప్రెస్ క్లబ్లో మీడియా దందా నడుస్తుంటుంది. పత్రికా విలేకరులంతా ఓ సిండికేట్ గా ఏర్పడి.. పంచాయితీలు చేస్తుంటారు. శివ (నవదీప్) ఇందులోని కీలకమైన సభ్యుడు. రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు వత్తాసు పలుకుతూ తమ జేబులు నింపుకొంటుంటారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన కేసుల్ని కూడా.. వీళ్లే సెటిల్ చేస్తుంటారు. వీళ్ల చుట్టూ తన పొలాన్ని కోల్పోయిన ఓ రైతు న్యాయం చేయమని తిరుగుతుంటాడు. ఆసుపత్రి లేక.. తన తాతయ్యని పోగొట్టుకొని అనాథ అయిన మనవరాలు న్యాయం కోసం ప్రెస్ క్లబ్‌కి వస్తుంది. మదనపల్లిలో ఆధిపత్యం కోసం పోరాడే రెండు వర్గాలు.. మీడియా సాయంతో ఎన్నికల్లో గెలిచి, తమ ప్రాబల్యం నిలుపుకోవాలని చూస్తుంటాయి. ఈ కథలన్నీ చివరికి ఏ కంచికి చేరాయి? ప్రెస్ క్లబ్లో జరిగిన అవినీతి వల్ల ఎంత మంది బలయ్యారు? అనేదే ఈ వెబ్ సిరీస్.
మీడియా తలచుకొంటే.. ఏమైనా చేయగలదు. ఓ నిజాన్ని వెలికి తీయగలదు. అబద్దాన్ని నిజమని భ్రమలో పడేయగలదు. సామాన్యులకు అండగా ఉండాల్సిన పత్రికలు, పత్రికా ప్రతినిథులు బలవంతుడికి ఎలా కొమ్ము కాస్తున్నాయి? అవినీతికి పహారాగా ఎలా నిలబడగలుగుతున్నాయి? అనేది ఈ వెబ్ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఆరు ఎపిసోడ్ల ఈ కథలో. ప్రతీ ఎపిసోడ్‌లోనూ.. మీడియా ఎంత దిగజారిపోతోందో, డబ్బులకు ఎలా లొంగిపోతుందో చూపించారు. పొలం కోల్పోయిన అయ్యప్ప అనే రైతు దీన గాథ హృదయాన్ని ద్రవింప చేస్తుంది. తాతయ్యని కోల్పోయిన మనవరాలి కథ.. ఆమె చేతగాని తనం సమాజంలోని చీకటి కోణాల్ని బయటపెడతాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు.. ప్రజల్ని ఎలా మోసం చేస్తూ తమ పబ్బం గుడుపుకొంటున్నాయో చూపించే ప్రయత్నం చేశారు. కవర్ల కోసం, బిరియానీల కోసం ఎదురు చూసే.. పత్రికా ప్రనిధులకు చెంపపెట్టులాంటి సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి.
`సమోసాల మీద బతికే వాళ్లు సమస్యలు ఎలా తీరుస్తారు` అనే డైలాగ్ ఉంది ఈ వెబ్ సిరీస్‌లో. జర్నలిస్టులపై ఇది ఓ తిరుగులేని సెటైర్. ఇలాంటివి చాలా తగులుతాయి. ఓ పొలిటీషన్ తన కుక్కలకు బిస్కెట్లు వేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే తన దగ్గరకు జర్నలిస్టులు వస్తారు. `జర్నలిస్టులు వచ్చారు.. బిస్కెట్లు రెడీ చేయ్` అని సహాయకుడికి హుకూం జారీ చేస్తాడు ఆ పొలిటీషన్. అంటే ఇక్కడ కుక్కలకు వేసే బిస్కెట్లు, జర్నలిస్టులకు వేసే బిస్కెట్లూ రెండూ ఒక్కటే అన్నమాట.
ఇది కేవలం జర్నలిస్టుల్ని ఎండగట్టే కథే అనుకోవడానికి వీల్లేదు. తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టు.. వ్యవస్థలోని ప్రతీ చోటా.. ఈ దుర్మార్గం కనిపిస్తూనే ఉంటుంది. అయ్యప్ప స్థలాన్ని లాక్కోవడంలో రాజకీయ నేతలతో పాటు ఎం.ఆర్.ఓ ప్రమేయం కూడా ఉంటుంది. తన బిడ్డకు వైద్యం చేయమని ఓ నిరుపేద మహిళ ప్రాధేయ పడితే… ఆమె శీలాన్ని ఫీజుగా అడిగే వైద్యుడ్ని చూపించారు ఈ సిరీస్‌లో. ఇలా అవినీతి ప్రతీ చోటా ఉందన్న విషయాన్ని చెబుతూనే వెళ్లారు. మీడియా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దేశాల తలరాతల్ని ఎలా మారుస్తుందో చూపించేంత కథ ఉంది ఇందులో. కానీ దర్శకుడు ఆ లోతుల్లోకి వెళ్లలేదు. కేవలం మదనపల్లికి మాత్రమే పరిమితమయ్యాడు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. మనకు అర్థదమయ్యే విషయాలే.. మనకు తరచూ కనిపించే పరిస్థితులే తెరపైనా దర్శనమిస్తాయి.
అయితే ఈ సిరీస్ అంతా నెగిటీవ్ వైబ్రేషన్సే. పాజిటీవ్ కోణం ఒక్కటీ లేదు. అవినీతి ప్రతీ చోటా ఉంది. కానీ అందరూ ఇంతే అని చూపించడం కరెక్ట్ కాదు. తప్పూ ఒప్పూ రెండూ చెప్పాలి. మీడియాలోని మంచీ చూపించాలి. అది ఈ సిరీస్‌లో కనిపించలేదు. పైగా సిరీస్‌లో ఏ ఎపిసోడ్ తీసుకొన్నా.. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ సమస్యలు, ఈ అవినీతి
ఎప్పటి నుంచో చూస్తున్నదే. కాకపోతే.. ఈసారి మీడియా కోణం నుంచి చూపించారంతే. క్లైమాక్స్ అర్థవంతంగా లేదు. సడన్ గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. బహుశా.. సీజన్ 2 కోసం అలా చేశారేమో..? ఎంత అవినీతిలో కూరుకుపోయినా.. ప్రధాన పాత్ర ధారులకు ఎక్కడో ఓ చోట రియలైజేషన్ కలుగుతుంది. పాజిటీవ్ వైపుగా అడుగులు వేస్తారు. కానీ.. ఇక్కడ అదీ ఉండదు. కథ ప్రారంభంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో చివరి వరకూ అలానే ఉంటాయి.
నవదీప్ చాలా సహజంగా నటించాడు. శివ పాత్రలో ఒదిగిపోయాడు. చిత్తూరు యాసని బాగా ఒడిసిపట్టుకొన్నాడు. తెరపై కొత్త నవదీప్‌ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బిందు మాధవి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే. కానీ.. తను కూడా సహజంగా ఉంది.
పాత్రలన్నీ చిత్తూరు మాండలికంలోనే మాట్లాడతాయి. ఆ కంటిన్యుటీ దర్శకుడు మిస్ అవ్వలేదు. మదనపల్లి ఊరుని బాగా క్యాప్చర్ చేశారు. ఆ ఊరు కూడా పాత్రలా మారిపోతుంది. నిర్మాణ విలువలు బాగానే కనిపించాయి. కథకు ఏం కావాలో.. అవన్నీ అందించారు. ఓ వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ రాదు. సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే.. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. మాటల్లో నాటకీయత లేదు. సహజత్వం కనిపించింది. మీడియాపై ఎక్కువ సెటైర్లు పడ్డాయి. కాకపోతే.. ముగింపు మాత్రం ఆకట్టుకోదు. ఆ సంతృప్తి కూడా కావాలంటే సీజన్ 2 వరకూ ఎదురు చూడాలేమో..?