ఎలక్ట్రానిక్ మీడియా ఎంతగానో విస్తరించి, ఇప్పటి వార్తలు అప్పుడే లైవ్ కవరేజి ఇస్తున్నప్పటికీ కూడా, ప్రజలు ఇప్పటికీ వార్తా పత్రికలను ఆదరిస్తూనే వున్నారు. పైగా ఈ పత్రికలో ఎలా ఒక వార్తను కవర్ చేశారు అన్న విషయంపై చర్చించుకుంటూ నే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న జగన్ పై జరిగిన దాడిని ఏ పత్రికలో ఎలా కవర్ చేశాయో చూద్దాం:
సాక్షి పత్రిక: జగన్ పై హత్యాయత్నం
జగన్ సొంత మీడియా సాక్షి లో ఈ వార్త బ్యానర్ స్టోరీగా మొదటి పేజీ లో వచ్చింది. మొదటి పేజీ మొత్తం ఈ దాడి కి సంబంధించిన వార్తల కే కేటాయించారు. మిగతా అన్ని పత్రికలలోనూ జగన్ పై దాడి అన్న హెడ్డింగ్ పెడితే సాక్షి లో మాత్రం జగన్ పై హత్యాయత్నం అన్న శీర్షిక, సర్కారు పెద్దల క్రూర పరిహాసం అన్న ఉపశీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఈ బ్యానర్ స్టొరీ తో పాటు ప్రజాస్వామ్యంలో మరో దుర్దినం అన్న వార్త కూడా మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను, డిజిపి వ్యాఖ్యలను మొదటి పేజీలో ప్రచురించారు. ఎడిటోరియల్ పేజీలో కూడా రెండు వ్యాసాలు ఈ సంఘటన గురించి విశ్లేషిస్తూ రాశారు.
ఈనాడు పత్రిక: జగన్ పై దాడి
ఇక ఈనాడు పత్రికలో జగన్ పై దాడి అన్న బ్యానర్ స్టోరీ తో పాటు, ఆపరేషన్ గరుడ నిజమేనేమో అన్న చంద్రబాబు వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ప్రచురించారు. ఇటు ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ఆరోపణలతో పాటు అటు వైఎస్ఆర్ సిపి శ్రేణుల నిరసనలను కూడా ప్రముఖంగా ప్రచురిస్తూ, సమతూకం పాటించారు.
ఆంధ్రజ్యోతి పత్రిక
ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ వార్తను బ్యానర్ స్టోరీగా ఇచ్చింది. కానీ చిన్నపాటి వెటకారం ప్రదర్శించింది. రాష్ట్ర విభజన నాటి నుండి, అన్ని పత్రికలు ఆంధ్రప్రదేశ్ కి ఒక వెర్షన్, తెలంగాణ కి ఒక వెర్షన్, హైదరాబాద్ ప్రాంతానికి మరొక వెర్షన్ ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వెర్షన్లో జగన్ పై అభిమాని దాడి అని హెడ్డింగ్ ఇచ్చింది. తద్వారా వార్త లోపల ఇటువంటి విశ్లేషణ చేయనున్నారో అన్న క్లారిటీ హెడ్డింగ్ తో నే ఇచ్చినట్టయింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక హైదరాబాద్, తెలంగాణ కి సంబంధించిన రెండు వెర్షన్లలో మాత్రం కోడి కత్తితో జగన్ పై దాడి అంటూ ఇవ్వడం కాస్త వెటకారం లాగానే కనిపించింది.
ఆంధ్రప్రభ పత్రిక: జగన్ పై కత్తి దాడి
ఇటీవల ఈ పత్రిక ఓనర్ జనసేన పార్టీలో చేరడంతో, ఏదైనా వార్తను ఈ పత్రిక ఎలా కవర్ చేస్తుంది అన్న అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రభ పత్రిక కూడా జగన్ పై కత్తి దాడి అన్న హెడ్డింగ్ తో బ్యానర్ స్టోరీ ప్రచురించింది. దానితో పాటే, దాడి అమానుషం అని దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది.
ఇతర పత్రికలు:
అలాగే వార్త పత్రిక, సూర్య పత్రిక కూడా ఈ సంఘటనను మొదటి పేజీలోనే ప్రచురించాయి. సంఘటన తో పాటు చంద్రబాబు ఆరోపణలను కూడా మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించాయి. కమ్యూనిస్టు పత్రిక అయినా ప్రజాశక్తి కూడా ఇదే విధంగా జగన్ పై దాడిని, ముఖ్యమంత్రి ఆరోపణలను మొదటి పేజీలో పక్కపక్కనే ప్రచురించింది.
అయితే ఈ సంఘటనని జగన్ జగన్ పై దాడి అని కాకుండా, జగన్ పై హత్యాయత్నం అంటూ కవర్ చేసిన మరొక పత్రిక ఆంధ్రభూమి. సంఘటన బ్యానర్ స్టోరీగా ఇవ్వడంతో పాటు, వైయస్ భారతి హాస్పిటల్ కు చేరుకున్న ఫోటోను కూడా మొదటి పేజీలో ప్రచురిస్తూ, గాయానికి శస్త్రచికిత్స చేశారని మరొక వార్త మొదటి పేజీలో ప్రచురించారు. ఇక తెలంగాణ పత్రిక ఆయన నమస్తే తెలంగాణ ఈ వార్తను లైట్ తీసుకుంది. మరొక తెలంగాణ పత్రిక నవ తెలంగాణ మాత్రం ఈ వార్తను మొదటి పేజీలో ఒక చిన్న వార్తగా ప్రచురించారు.
ఏది ఏమైనా, ఆంధ్రప్రదేశ్లో సర్క్యులేషన్ కలిగిన అన్ని పత్రికలు ఈ వార్తను ప్రచురించాయి. అయితే ప్రజెంటేషన్లో మాత్రం ఆయా పత్రికల రాజకీయ ధోరణికి అనుకూలమైన శైలిలో వార్తని ప్రజెంట్ చేశాయి
– జురాన్ ( CriticZuran)