2018 ఆస్కార్ కి భారత్ తరపున అధికారిక ఎంట్రీ గా “న్యూటన్” మూవీ ఎంపికైనట్టు ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. మొత్తం 26 సినిమాలు పరిశీలించి అందులోనుంచి ఈ సినిమాని ఎంపిక చేసారు. పరిశీలించబడ్డ 26 సినిమాల్లో బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటు దంగల్ కూడా ఉంది. అయితే కమిటీ మాత్రం న్యూటన్ మూవీ కే మొగ్గు చూపింది.
ఈ న్యూటన్ మూవీ కథ ఇలా ఉంటుంది- ఛత్తీస్ గఢ్ ప్రాంతం లో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి న్యూటన్ అనే ఒక ప్రభుత్వ అధికారి వెళ్తాడు. అయితే అది నక్సల్ ప్రభావిత ప్రాంతం. కమ్యూనిస్ట్ తిరుగుబాటుదారుల నుంచి, నక్సల్స్ నుంచి ఎదూరయ్యే ఒడిదుడుకులు తట్టుకుని ఎన్నికలు ఎలాగైనా జరిపితీరాలనుకునే మొండి అధికారి ఈ న్యూటన్. అయితే అక్కడ నక్సల్స్ గెరిల్లా తరహా దాడులు జరిపి మరీ ఎన్నికలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారనే సమాచారం ఉన్నప్పటికీ సెక్యూరిటీ దళాల నుంచి న్యూటన్ కి పెద్దగా సహకారమందదు. ఇలా ఎవరి సహకారమూ లేకపోయినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొండిగా నిలబడి ఎన్నికలు నిర్వహించడం ద్వారా తన విధులు సక్రమంగా పూర్తి చేసిన ఈ న్యూటన్ కథే ఇప్పుడు ఆస్కార్ కి వెళ్ళనుంది.
అయితే ఇది కేవలం భారతదేశం నుంచి ఎంట్రీ గా పంపబడింది. ఇలా అన్ని దేశాల నుంచి వచ్చిన సినిమాలని చూసి వాటిలోంచి తదుపరి వడపోత జరుపుతుంది అకాడెమీ అవార్డ్ కమిటీ. దాదాపు ప్రతి సంవత్సరమూ మనదేశం నుంచి ఎంట్రీలని పంపినా ఇప్పటి వరకూ, ఇన్ని దశాబ్దాల్లో కేవలం మూడు సినిమాలు – మదరిండియా, సలాం బాంబే, లగాన్ మాత్రమే ఆ వడపోతని దాటి ఆస్కార్ బరిలో చివరివరకూ నిలిచాయి. గత ఏడు పంపిన ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం విసారణై, అంతకు ముందు సంవత్సరాల్లో పంపిన మరాఠీ చిత్రం కోర్ట్, హిందీ సినిమా బర్ఫీ లతో పాటు, ఇప్పటి దాకా పై మూడు చిత్రాలు తప్ప ఏవీ అస్కార్ వడపోత దశని దాటలేదు. అలా దాటిన మదరిండియా, సలాం బాంబే, లగాన్ సహా ఏ భారతీయ చిత్రమూ ఫైనల్ విన్నర్ గా నిలవలేదు. బోస్నియా లాంటి చిన్న దేశం నుంచి వచ్చిన నో మ్యాన్ ల్యాండ్ లాంటి చిత్రాలు కూడా ఫైనల్ విన్నర్ గా నిలిచినప్పటికీ భారత్ నుంచి ఇప్పటివరకూ ఏ సినిమా అలా నిలవలేదు. ఇక భారతీయులైన భాను అతేయ, ఏ ఆర్ రహమాన్, రసూల్ పోకుట్టి లకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినా అవి భారతీయ చిత్రాలు కావు.
మరి ఈ పరిస్థితి ని న్యూటన్ ఏమైనా మారుస్తాడేమో చూడాలి!!!