Next Enti Movie Review
ఏం చెబుతున్నాం? అనేదే కాదు.
ఎలా చెబుతున్నాం?
ఎవరికి చెబుతున్నాం? అనేవి కూడా చాలా ముఖ్యం. చెప్పాల్సిన మేటర్‌లో కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కానీ చెప్పే విధానంలో ఉండకూడదు. చెప్పాలనుకున్న విషయంలోనూ, చెప్పే విధానంలోనూ గందరగోళం ఉంటే, సినిమా మాట దేవుడెరుగు.. ఆ ప్రేక్షకుడ్ని కాపాడడానికి దేవుడే దిగిరావాలి. అచ్చంగా ఇలాంటి ఫీలింగ్ కలిగించిన సినిమా ఈమధ్యకాలంలో మరేదైనా ఉందీ అంటే… అది `నెక్ట్స్ ఏంటి` నే.
* కథ
ఈ సినిమా కథ ఇదీ అని చెప్పడానికి కూడా దర్శకుడు ఓ ఆస్కారం లేకుండా చేశాడు. అయినా సరే – కథని వెదికి పట్టుకునే ప్రయత్నం చేస్తే…
టానీ (తమన్నా) సంజూ (సందీప్ కిషన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ ఇద్దరి మనస్తత్వాలు వేరు. సెక్స్ అనే అవసరం లేకుండా.. అబ్బాయి, అమ్మాయి కలుసుకోలేరు.. అసలు ఆ ప్రేమలో ప్రేమే లేదు అన్నది టానీ ఉద్దేశం. సందీప్ మరోలా ఆలోచిస్తాడు. సెక్స్ లేకుండా ప్రేమ మరో స్థాయికి వెళ్లదన్నది సంజూ నమ్మకం. ఈ విషయం దగ్గరే తేడా కొట్టి.. ఇద్దరూ విడిపోతారు.
టానీకి క్రిష్ (నవదీప్) పరిచయం అవుతాడు. తనకు ఆల్రెడీ పెళ్లవుతుంది. ఆరేళ్ల పాప కూడా. కానీ విడాకులు తీసుకుంటాడు. క్రిష్ భావాలు తనకు నచ్చుతాయి. ఓ అబ్బాయి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటుందో అలాంటి లక్షణాలే క్రిష్‌లో ఉంటాయి. మరోవైపు సంజూకి రోషిణి అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. మరి.. సంజూ, టానీల కొత్త ప్రేమకథలైనా సవ్యంగా సాగాయా? మళ్లీ బ్రేకప్ చెప్పుకున్నారా? టానీ, సంజూలకు అసలు కావల్సిందేంటి? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
ఓ సినిమాని అత్యంత గందరగోళంగా తీయడం ఎలా?? అని చెప్పడానికి ఈసినిమాని ఉదాహరణగా చూపించొచ్చేమో. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇదేం థ్రిల్లర్ కాదు, హారర్ కాదు. ఓ ప్రేమకథ (ఓ విధంగా అది కూడా కాదు) ఇంత అయోమయంగా తీసిన సినిమా ఇదే. అమ్మాయిలు అబ్బాయిల గురించి ఏం ఆలోచిస్తారు, అబ్బాయిలు అమ్మాయిల కోసం ఎలా ఆలోచిస్తారు. అసలు అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు ఏమనుకుంటారు? అనే ప్రశ్నలకు డిస్కర్షన్లా, డిబేట్ లా అనిపించే సినిమా ఇది. కెమెరాని చూస్తూ పాత్రలు మాట్లాడుతుంటాయి. ముఖ్యంగా తమన్నా పాత్ర. అది ఎంత బోరింగ్‌గా అనిపిస్తుందంటే.. రాను రాను.. అలాంటి నేరేషన్ వచ్చేసరికి.. థియేటర్ గోడల్ని బద్దలు కొట్టి పారిపోవాలన్నంత కసి, కోపం వచ్చేస్తుంటాయి.
సందీప్ – తమన్నాలు కనిపించిన మొదటి సీన్లోనే.. ఈ సినిమా ఎలా సాగబోతోంది అని చెప్పడానికి ఓ హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. ఆ సీనే దాదాపు 5 నిమిషాలు సాగుతుంది. ఈ 5 నిమిషాలూ కెమెరా ఓ చోటే ఉంటుంది. రెండు పాత్రలు మాట్లాడుకుంటుంటే.. అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఆ 5 నిమిషాల డిస్కర్షన్ ఏమిటంటే.. అబ్బాయిల దృష్టిలో అమ్మాయిలు – అమ్మాయిల దృష్టిలో అబ్బాయిలు..!
ఏదో ఒక్క సీన్లో దర్శకుడు ఏదో చెబుదామని తాపత్రయపడ్డాడులే అనుకుంటే.. సినిమా మొత్తం ఇదే తంతు. ప్రతీ సీనూ.. టార్చర్ అనే పదాన్ని టార్చిలైట్ వేసి మరీ చూపిస్తుంటుంది. ఒకే మాటని అటు తిప్పి, ఇటు తిప్పి.. చివరికి టాపిక్కు అమ్మాయిలు – అబ్బాయిలు అనే పాయింట్ దగ్గరే ఆగుతుంది. సంజూ – టానీల బ్రేకప్ కి ఓ కారణం ఉంటుంది. టానీ.. క్రిష్‌ని వదిలేసి ఎందుకు వచ్చిసిందో అర్థం కాదు. క్రిష్‌కి పెళ్లయ్యిందన్న సంగతి టానీకి ముందే తెలుసు. అయినా ప్రేమిస్తుంది. మరి అదే కారణం చెప్పి… బ్రేకప్ ఎందుకు చెప్పిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అక్కడి నుంచి వచ్చేసి.. మళ్లీ సంజూని కోరుకోవడం, ఇద్దరి మధ్య మళ్లీ ట్రాక్ మొదలవ్వడం మరింత ఆశ్చర్యంగా, వింతగా అనిపిస్తుంది. దర్శకుడు ఓ న్యూ యేజ్ లవ్ స్టోరీని చెప్పాలనుకున్నాడు. అయితే.. ఈ తరంలో మరీ అంత కన్ప్యూజన్ అయితే ఏం లేదు. ఒక్కో పాత్ర ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తుంటుంది. అభిప్రాయాలు మార్చుకుంటున్నది పాత్రలా? లేదంటే దర్శకుడా? అసలు పాయింట్ తో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అనేది ఎంత ఆలోచించినా బుర్రకెక్కదు. `ఈ సినిమా ఇప్పుడు అయిపోతే బాగుణ్ణు` అని ప్రతీసారీ అనుకుంటూనే ఉన్నా.. మరో కొత్త సీను తెరపైకొస్తుంటుంది. పోనీ అదేమైనా కొత్త విషయం చెప్పిందా అంటే… అక్కడా అరిగిపోయిన రికార్డే.
శరత్ బాబు – తమన్నాల మధ్య చూపించిన తండ్రీ కూతుర్ల అనుబంధం కూడా అంతే ట్రెండీగా.. మనవాళ్లు ఏమాత్రం జీర్ణించుకోలేనంత కొత్తగా ఉంటుంది. ఓ తండ్రి తన కూతుర్ని ముందు పెట్టుకుని మందు కొట్టడం ఇప్పటి వరకూ చూసుంటాం. `వీటిలో ఏదో ఓ బ్రాండ్ తాగు.. ఏది బాగుందో నాకు చెప్పు` అని ఆఫర్ చేయడం ఈ సినిమాలోనే చూస్తాం. సిగరెట్ కూడా ఆఫర్ చేసి.. దగ్గరుండి దమ్ము కొట్టించడం ఈ సినిమా స్పెషాలిటీ. లండన్ నేపథ్యంలో సాగిన కథే అయినా… క్యాటర్ చేస్తున్నది ఇక్కడి ప్రేక్షకులకు అనే విషయాన్ని దర్శకుడు మరిచిపోయాడు.
* నటీనటులు – సాంకేతికత
చాలాసహజంగా చేయాల్సిన చోట కూడా.. ఓవర్ యాక్షన్ చేసి, చాటంత దానికి చాపంత పెర్‌ఫార్మ్సెన్స్ ఇవ్వడంలో సందీప్ కిషన్‌కి మించినోడు లేడు. అసలే.. బోరింగ్ కథకీ, నత్తనడక స్క్రీన్ ప్లేని నిలువుటద్దంలా సాగిన ఈ సినిమాలో సందీప్ నటన మరింత ఇరిటేషన్ తెప్పిస్తుంటుంది. బయట కొంచెం గ్లామర్‌గానే కనిపించే సందీప్… ఈ సినిమాలో మరీ నల్లగా దర్శనమిచ్చాడు. బహుశా.. పక్కన తమన్నా ఉంది కాబట్టి తేలిపోయాడేమో. తమన్నా ఎక్కువ మాట్లాడి, తక్కువ యాక్ట్ చేసిన సినిమా ఇదొక్కటేనేమో. ఉన్నవాళ్లలో నవదీప్ ఒక్కటే సెలిల్గా చేశాడు.
సాధారణంగా స్క్కిప్టు 200 పేజీల వరకూ ఉంటుంది. ఈ సినిమా కి 2000 పేజీలు ఉన్నా ఆశ్చర్యం లేదు. అన్ని డైలాగులున్నాయి. ప్రతీ పాత్ర లొసపిట్టలా వాగుతూనే ఉంటుంది. `నో నో నెవర్` పాట తప్ప మిగిలినవేవీ ఆకట్టుకోవు. ఫనా లాంటి సినిమాలు తీసిన దర్శకుడేనా.. ఈ సినిమా తీసింది అనే ఆశ్చర్యం, బాధ రెండూ కలుగుతాయి. ఎడిటర్‌కి ఎక్కడ కత్తెర వేయాలో తెలీక… సినిమాని యధాతధంగా వదిలేసి, తన పని తగ్గించాడు. ప్రేక్షకుల్ని మరింతగా కష్టపెట్టాడు.
* తీర్పు
ఓ కెమెరా.. నలుగురు ఆర్టిస్టులు.. మీరూ మీరూ మాట్లాడుకోండి అని దర్శకుడు వాళ్ల మానాన వాళ్లని వదిలేసి, ఆ పిదప వచ్చిన ఫుటేజీని ఎక్కడా కత్తిరించకుండా వదిలేస్తే… ఇలాంటి కళాఖండాలే బయటకు వస్తాయి.
ఫినిషింగ్ టచ్: ‘నో.. నో.. నెవర్’
తెలుగు360 రేటింగ్: 1/5