తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
హారర్ కామెడీపై మోజు తగ్గడం లేదు. ఈ జోనర్ మరీ రొటీన్ అయిపోతున్నా.. ఇంకా ఏదో ఉంది అన్న ఫీలింగ్‌తో తోడుతూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. అది చాలదన్నట్టు… పక్క భాషలో ఆడిన కథల్ని రీమేక్ పేరుతో ఎరువు తెచ్చుకొంటున్నారు. ‘నెక్ట్స్ నువ్వే’ కూడా రీమేక్ కథే. బుల్లి తెరపై సుపరిచితుడైన ప్రభాకర్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలసి ఈ సినిమాని రూపొందించడంతో – మామూలు హారర్సినిమాల స్థాయి కంటే.. `నెక్ట్స్ నువ్వే`కి ప్రచారం ఎక్కువ లభించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రీమేక్ హక్కులు కొని మరీ తీయాల్సినంత విశేషం ఏం కనిపించింది??
కథ
కిరణ్ (ఆది) ఓ సీరియెల్ డైరెక్టర్. `సంసారం సేమియా ఉప్మా` అనే సీరియల్ కోసం రూ.50 లక్షలు అప్పు చేస్తాడు. ఆ సీరియల్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, అప్పులోళ్లు వెంటపడడంతో ఏం చేయాలో తోచదు. ఈలోగా.. అరకులో తన పేర ఓ పేలస్ ఉందని తెలుస్తుంది. ఆ పేలస్ని బాగు చేయడానికి మరో రూ.50 లక్షలు అవసరం అవుతాయి. దాన్నీ ఎలాగొలా సంపాదించి పేలస్ని బాగు చేయిస్తాడు. అక్కడో రిసార్ట్స్ మొదలెడతాడు. అతనికి శరత్ (బ్రహ్మాజీ) రేష్మీ (రేష్మి) సాయంగా వస్తారు. రిసార్ట్స్ అడుగుపెట్టినవాళ్లంతా తెల్లారే సరికి శవాలుగా కనిపిస్తుంటారు. ఈ విషయం బయటకు తెలిస్తే రిసార్ట్స్ మూతపడుతుందన్న భయంతో.. వాళ్లని పూడ్చి పెట్టేస్తుంటారు. అలా… రిసార్ట్స్ వెనుక ఓ స్మశాసమే వెలుస్తుంది. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి. వీళ్లందరి చావుకి కారణం ఏమిటి? ఆ ప్యాలస్‌లో దెయ్యం ఉందా, లేదా? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ
ఇదో తమిళ సినిమాకి రీమేక్. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ రీమేక్ హక్కుల్ని అట్టిపెట్టుకొని – మరో మూడు సంస్థలతో కలసి ఈ సినిమాని చేస్తోందంటే ఏదో విశేషం, విషయం ఉండే ఉంటుంది అనుకొంటారు. కానీ.. రొటీన్ కథని సైతం ఆవురావురమంటూ ఎత్తుకొచ్చారన్న విషయం సినిమా మొదలైన కాసేపటికే తెలిసిపోతుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. అన్ని హారర్ సినిమాల్లానే.. ఓ బంగ్లా చుట్టూ తిరుగుతుంది. హారర్ + కామెడీ అని చెప్పారు గానీ.. హారర్ ని దర్శకుడు అస్సలు టచ్ చేయలేదు. మొహాలకు మేకప్ వేసి.. దాన్నే దెయ్యం అనుకోమంటే అదీ కామెడీగానే అనిపిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. `సంసారం సేమియా ఉప్మా` సీరియెల్ తో కథ మొదలవుతుంది. కామెడీ పండించడానికి సీరియెల్స్పై సెటైర్లు వేసే అవకాశం దక్కింది. కానీ.. టీవీ రంగం నుంచే వచ్చిన ప్రభాకర్ దాన్ని వాడుకోలేదు. ప్యాలెస్‌లో కథ అడుగుపెట్టినా.. జోష్ లేదు. ఆ ప్యాలెస్‌లోకి వచ్చినవాళ్లు వచ్చినట్టు చచ్చిపోతున్నా… అందులో ఉన్న నాలుగు పాత్రలూ చాలా కూల్‌గా ప్రవర్తిస్తుంటాయి. దాంతో ప్రేక్షకుడికి కలగాల్సిన ఉత్సాహం, సీరియెస్ నెస్ ముందే పోతాయి. విశ్రాంతి ఘట్టం ముందు కూడా దర్శకుడు చెప్పదలచుకొన్న పాయింట్లోకి వెళ్లలేదు.
సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్, ట్విస్ట్ వస్తాయి. కానీ… అప్పటికే సినిమాపై ఓ అవగాహనకు వచ్చేస్తాడు ప్రేక్షకుడు. ఫ్లాష్ బ్యాక్ పేలవంగా ఉండడంతో… అక్కడ కథ మరింత డ్రాప్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో అవసరాల శ్రీనివాస్‌ని చూపించి.. అదే పాత్రని ప్రజెంట్లో ఎల్బీ శ్రీరామ్ చేత వేయించారు. అదేం లాజిక్కో అర్థం కాదు. వయసు పెరిగితే ఆకారం మరీ అంతలా మారిపోతుందా?? బ్రహ్మజీ కామెడీ కూడా అంతంతమాత్రమే అయినా… కాస్తలో కాస్త అదే నయం అనిపించింది. ఆర్జీవీగా రఘుబాబు కామెడీ, దాంట్లోంచి పుట్టుకొచ్చిన సన్నివేశాలు కూడా రొటీనే. పతాక సన్నివేశాలూ అలానే నడిచాయి.
నటీనటుల ప్రతిభ
ఆదికి ఇది కొత్త జోనర్. తన వరకూ ఫర్వాలేదనిపించాడు. తనదైన హుషారైన నటన చూసే అవకాశం రాలేదు. రష్మి పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం. అంతకు మించి చేసిందేం లేదు. శరత్‌గా బ్రహ్మాజీకే ఎక్కువ మార్కులు వేయాలి. ఎల్బీ శ్రీరామ్, అవసరాల, ఫృద్వీ, పోసాని… వీళ్లందరివీ చిన్న చిన్న పాత్రలే. ఇక ఈ సినిమాలో కథానాయిక కనిపించిన అమ్మాయి సీరియల్ హీరోయిన్లా ఉంది గానీ, సినిమా హీరోయిన్లా లేదు.
సాంకేతిక వర్గం
రీమేక్ సినిమా కాబట్టి…. కాపీ పేస్ట్ చేయడానికే దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చాడు. సీన్లు మార్చేందుకు పెద్దగా స్కోప్ కూడా లేదిక్కడ. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చి ఉండరు. రెండే రెండు పాటలున్నాయి. ఎక్కువైనా మరీ బోర్ కొట్టేస్తుంది. నేపథ్య సంగీతం కథ, కథనాలకు తగ్గట్టుగా రొటీన్ గాసాగింది. ఓ ఇంట్లోనే తిరిగే కథ కాబట్టి.. తక్కువ బడ్జెట్లోనే సినిమా పూర్తయిపోయి ఉండొచ్చు.
తీర్పు :
నెక్స్ట్ నువ్వే… ఒక రొటీన్ హారర్ కామెడీ. అక్కడక్కడా కాస్త కామెడీ విషయం లో న్యాయం జరిగినా… భయపెట్టే అంశాలు ఏమాత్రం లేవు. బ్రహ్మజీ కామెడీ, రష్మీ గ్లామర్ నచ్చే అంశాలు. ఆ రెండూ ఈ సినిమా ని ఎంత వరకు గట్టెక్కిస్తాయో చూడాలి !
ఫైనల్ టచ్ : ‘సంసారం సేమియా ఉప్మా’ సీరియలే బెటరేమో!
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5