ప్రస్తుతం దేశానికి ప్రథమపౌరుడిగా సర్వోన్నతమైన పదవిలో ఉన్న ప్రణబ్ దాదా తర్వాత ఆ పదవిని అధిష్ఠించేది ఎవ్వరు? ఈ విషయంలో ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సీనియారిటీ పేరు మీద కనీసం మంత్రి పదవి కూడా దక్కకుండా దూరం పెట్టబడిన భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అద్వానీ కి ఈ పదవి దక్కుతుందని పార్టీలో ఆయన అభిమానులకు ఒక ఆశ ఉంది. అయితే తాజాగా రాష్ట్రపతి పదవికి అమితాబ్ బచ్చన్ పేరును ప్రధాని మోడీ పరిశీలిస్తున్నట్లుగా తాజాగా వస్తున్న వార్తలు కొత్త సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి.
నిప్పులేనిదే పొగ రాదంటారు పెద్దలు. అలాగే రాష్ట్రపతి పదవికి అమితాబ్ బచ్చన్ పేరు పరిశీలనలో ఉన్నదనే సంగతి కూడా ఏదో ఆషామాషీగా పుట్టిన పుకారు కాదు. ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో, తెరవెనుక ఉండి అధికార శక్తులను తన ఇష్టప్రకారం నడిపిస్తూ చక్రం తిప్పడంలో ఉద్ధండుడిగా కొన్ని దశాబ్దాల అనుభవం, కీర్తి కలిగి ఉన్న సీనియర్ రాజకీయవేత్త, అత్యంత వివాదాస్పదుల్లో ఒకడు అయిన అమర్‌సింగ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
అమర్‌సింగ్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. వారి సాన్నిహిత్యం చాలా దృఢమైనది. అయితే ఆయన ఎంత గొప్ప లాబీయిస్టు అయినప్పటికీ… అమర్‌సింగ్ మాటలకు ఉన్న క్రెడిబిలిటీ తక్కువ. ఆయన ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్‌ను, అప్పట్లో మోడీకి తానే పరిచయం చేశానని.. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అమితాబ్‌ను బరిలోకి దింపాలనే మోడీ ఆలోచిస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఏకపక్షంగా నమ్మడానికి వీల్లేదు. అటు అమితాబ్ గానీ, ఇటు ప్రధాని మోడీగానీ ఈ వ్యాఖ్యలను పట్టించుకోలేదు కూడా! ‘జస్ట్ ఇగ్నోర్’ చేశారు.
అయితే పార్టీలో రేగుతున్న సంచలనం ఏంటంటే.. ఈ పదవిని కూడా అద్వానీకి దక్కకుండా చేయడానికి ప్రధాని మోడీ, లేదా కొన్ని ఇతర శక్తులు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయా? అనేది! భాజపాలో ఉక్కుమనిషిగా పేరున్న అద్వానీ పార్టీకోసం చేసిన సేవలు, త్యాగాలు సామాన్యమైనవి కాదు. ఆయన అనుభవాన్ని, పెద్దరికాన్ని తోసిరాజని.. హఠాత్తుగా మోడీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు వచ్చారు. అద్వానీకి కనీసం కేంద్రమంత్రి పదవికూడా లేకుండా వృద్ధ నాయకుల జాబితాలో పక్కన పెట్టారు. అయితే రాష్ట్రపతి పదవికి ఆయనను ఎంపిక చేస్తారని అప్పట్లో అంతా అనుకున్నారు. ఇప్పుడు అమితాబ్ పేరు గానీ, లేదా శరద్ పవార్ పేరుతో గానీ.. రేగుతున్న కొత్త పుకార్లను గమనించినప్పుడు.. అద్వానీ కి మరో మారు చేదు పరిణామాల్ని రుచిచూపించడానికి మోడీ కోటరీ వ్యూహరచనలో ఉన్నదా? అనే పుకార్లు నడుస్తున్నాయి.