తెలంగాణా ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. మళ్ళీ ఆ తరువాత ఆయన కానీ, వైకాపా నేతలు గానీ చివరికి సాక్షి మీడియా గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసు భయంతో తెలంగాణా ప్రాజెక్టులకి అభ్యంతరం చెప్పడం లేదని జగన్ వాదించారు. తెలంగాణా ప్రభుత్వం వలన రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతోందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వలన కూడా అంతే నష్టం జరుగుతోందని వాదిస్తూ దీక్షలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? హైదరాబాద్ లోనే ఉండే ఆయన వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయిందనుకోవాలా లేకపోతే అంతటితో ఆయన బాధ్యత తీరిపోయిందని అనుకోవాలా? లేకపోతే రాజకీయ కారణాలతోనే దీక్ష చేశారని అనుకోవాలా? అంటే మూడవదే కారణమని చెప్పక తప్పదు.
తెలంగాణా ప్రాజెక్టులే కాదు జగన్ దేనిపైనా నిజాయితీగా నిబద్దతతో పోరాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన ఖాయమని పసిగట్టిన వెంటనే దానిని వ్యతిరేకిస్తూ సమైక్యాంద్ర ఉద్యమం చేశారు. అది 2014ఎన్నికలని దృష్టిపెట్టుకొని చేసిందేనని అందరికీ తెలుసు. ఆ తరువాత పంటరుణాల మాఫీ, హుడ్ హూద్ తుఫాను సహాయ చర్యల కోసం, రాజధాని భూసేకరణ, గోదావరి పుష్కర యాత్రికుల మృతి, ప్రత్యేక హోదా, విశాఖ ఏజన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వలు, రైల్వే జోన్, తెలంగాణా ప్రాజెక్టులు, రైతు భరోసా యాత్రలు…ఇలాగ ఒకదాని తరువాత మరొక సమస్యపై జగన్ ఉద్యమిస్తూనే ఉంటారు. కానీ ఏదైనా మూడురోజుల ముచ్చటే. పైకి చెప్పుకొనే కారణం ఒకటి. వాటి ఉద్దేశ్యం వేరొకటి ఉంటుంది. తన ప్రియమైన రాజకీయ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏదో విధంగా అప్రదిష్టపాలు చేయడం, రాజకీయ మైలేజి పొందడం, ప్రజలని ఆకర్షించి పార్టీని బలోపేతం చేసుకోవడం అనే మూడు ప్రయోజనాలు ఆశించే జగన్ దీక్షలు చేస్తుంటారు.
ఆయనొక్కరే కాదు రాజకీయ పార్టీలన్నిటిదీ ఇదే పద్ధతి. వాటి రాజకీయ చదరంగంలో ఎల్లప్పుడూ ప్రజలే నష్టపోతుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డినే ఎందుకు విమర్శించవలసి వస్తోందంటే, ఆయన తనకు మాత్రమే నీతి నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత, మాట నిలకడ ఉన్నాయని పదేపదే గొంతు చించుకొని చెపుతుంటారు కనుక. వైకాపాకి ఆయువుపట్టు వంటి సాక్షి మీడియాఫై కొన్ని జిల్లాలలో నిషేధం విదించబడింది కనుక, వాటి పునరుద్దరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వేరే ఏదో పేరుతో త్వరలోనే నిరాహార దీక్షకి కూర్చొంటారేమో? ఈసారి ఏ సమస్యని చూపించి దీక్షకి కూర్చోంటారో?