రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందేనని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను కేఆర్ఎంబీ అమలు చేయలేకపోయింది. దీనిపై తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం సహకరించలేదని.. కేఆర్ఎంబీ అధికారులు ఎన్జీటీకి తెలిపారు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. అక్కడ ఎవరూ పర్యటించాల్సిన అవసరం లేదని.. అక్కడి పరిస్థితిపై తామే నివేదిక ఇస్తామని వాదించింది. అక్కడ డీపీఆర్ తయారీకి అవసరమైన సర్వేపనులు మాత్రమే చేస్తున్నామని చెప్పుకొచ్చింది.
ఏపీ సర్కార్ వాదనను ఎన్జీటీ పట్టించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి.. నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని మరోసారి ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సీమ ఎత్తిపోతలను పరిశీలించేందుకు కావాల్సిన హెలికాఫ్టర్.. భద్రతా ఏర్పాట్లను తాము కల్పిస్తామని తెలంగాణ సర్కార్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై గతంలోనే ఎన్జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా చేస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి … పనులు జరుగుతున్న ఫోటోలు, దృశ్యాలతో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు.
దానిపై విచారణ జరిపిన ఎన్జీటీ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తక్షణం… రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో ఉన్న పరిస్థితిని.. నిర్మాణాలు ఏమైనా జరిగాయేమో చెప్పాలంటే్… కృష్ణా రివర్ బోర్డుని… పర్యావరణశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కానీ వారు పరిశీలన చేయలేకపోయారు. ఎన్జీటీ తీర్పు తర్వాత కూడా.. అక్కడ పర్యటించడానికి ఏపీ సర్కార్ అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు ఏపీకి సంబంధం లేకుండా పరిశీలించాలని కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు.. ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంటుందో.. వేచి చూడాల్సి ఉంది.