పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈ స్టే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రాజెక్టుల వివాదానికి సంబంధించినది కాదు. పూర్తిగా పర్యావరణానికి సంబంధించినది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే.. పెద్ద ఎత్తున పర్యావరణానికి హాని కలుగుతుందంటూ… నారాయణపేటకు చెందిన ఓ రైతు ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఎన్జీటీ బెంచ్.. 4 శాఖల సభ్యులతో పోతిరెడ్డి పాడు నిర్మాణం వల్ల ఏర్పడే సమస్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించారు.
కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిపుణులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ… నిర్మాణాలపై స్టే కొనసాగుతుంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి.. టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్న దశలో ఎన్జీటీ స్టే విధించడం.. ఏపీ సర్కార్‌కు కాస్త చికాకు కలిగించే అంశమే. అయితే.. ప్రస్తుతం ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇంకా టెండర్లు కూడా పిలవలేదు. నిర్మాణాలు ప్రారంభించకుండా… అలా ప్రారంభించడానికి అవసరమైన కసరత్తుపై ఎన్జీటీ స్టే ఇవ్వలేదన్న అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అందుకే.. టెండర్ల విషయంలో ముందుకెళ్లినా… నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నిర్మాణాలు ప్రారంభించవచ్చని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు.. ఏపీ సర్కార్ గోదావరిపై.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమం అంటూ చేసిన ఫిర్యాదుపై గోదావరి బోర్డు స్పందించింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం, తుపాకుల గూడెం, పెన్‌గంగపై మూడు ఆనకట్టలు, రామప్పచెరువు నీటి మళ్లింపు పథకాల డీపీఆర్‌లు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ను కోరింది.