రుషికొండ గూగుల్ మ్యాప్ చూస్తే.. చుట్టూ కందకంలా తవ్విన ఫోటో కనిపిస్తుంది. రుషికొండను పిండి చేస్తున్నారని పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం తగ్గలేదు. ఇప్పుడు విశాఖలోని రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తక్షణం తవ్వకాలు నిలిపివేయాలని.. ఎన్జీటీ ఆదేశించింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది.
ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఎన్జీటీ తెలిపింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ స్పష్టం చేసారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తవ్వకాలు జరుపుతోంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోని ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీర నోడల్ ఎజెన్సీగా విచారణ జరపడం అంటే… అన్నీ కరెక్ట్‌గానే జరుగుతున్నాయని నివేదిక రాకుండా.. నిబంధనలు ఉల్లంఘించారని నివేదిక ఇస్తారా అన్నసందేహం మొదటే ప్రారంభమవుతుంది.
రుషికొండపై అంతకు ముందు హరిత రిసార్ట్స్ ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కూల్చి వేసింది. కొత్త నిర్మాణాల కోసం రుషికొండను తవ్వడం ప్రారంభఇంచారు. ఎండాడ సర్వే నంబరు 19లో 9.88 ఎకరాల్లో కొండపై తవ్వకాలకు గనుల శాఖ అనుమతించింది. అయితే అనుమతికి మించి తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరపకూడదని తెలిసినా పర్యాటక శాఖ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కొండ చుట్టూ తవ్వేశారు. మధ్య ప్రాంతం మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా తొలగిస్తారో లేదో కానీ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం నిర్మిస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తే అనుమతుల్లేవన్న కారణంగా పోలీసులు అడ్డుకున్నారు.