శ్రీ రవిశంకర్ కి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మొన్న మార్చి నెలలో డిల్లీలో యమునా తీరంలో భారీ స్థాయిలో ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటి కోసం యమునా తీరంలో సుమారు 150 ఎకరాలలో ఉన్నపంట పొలాలను చదును చేసి, అనేక భారీ చెట్లను నరికివేసినందుకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ సంస్థకి రూ.5 కోట్లు జరిమానా విదించింది. అప్పటికప్పుడు అంత పెద్ద మొత్తం చెల్లించలేమని ఆ సంస్థ నిర్వాహకులు చెప్పడంతో రూ. 25 లక్షలు అడ్వాన్స్ గా కట్టించుకొని, మిగిలిన రూ.4.75 కోట్లని నెలరోజులలోగా చెల్లించాలని ఆదేశించి, ఆ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతిచ్చింది. ఇది జరిగి ఇప్పటికి మూడు నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఇంతవరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆ మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా ఏవో కుంటిసాకులు చెపుతూ తప్పించుకొని తిరుగుతోంది. యావత్ ప్రపంచం దేశాల ప్రజలకి ఉన్నతంగా ఏవిధంగా జీవించాలో పాఠాలు చెప్పే రవి శంకర్, ఒప్పందం ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ కి చెల్లించవలసిన జరిమానాని చెల్లించకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కేసుని నిన్న విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తీరుని తప్పు పట్టింది. అది మిగిలిన డబ్బు చెల్లించకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తోందని, కానీ తప్పనిసరిగా రూ.4.75 కోట్లు చెల్లించి తీరవలసిందేనని, లేకుంటే చట్ట ప్రకారం కటిన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏదో అనామక సంస్థ ఏమీ కాదు. ప్రధాని మోడీతో సహా ఆయన ప్రభుత్వంలో అనేకమంది పెద్దలతో శ్రీ రవి శంకర్ కి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో లక్షలాది మంది భక్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకి శాఖలున్నాయి. అందుకే అది దేశవిదేశాలకు చెందిన అనేక లక్షల మందితో అంత అట్టహాసంగా ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగలిగింది. దానికి ఎంత ఖర్చయి ఉంటుందో ఎవరూ ఊహించలేరు కూడా. అన్ని కోట్లు ఖర్చు చేసి అంత అట్టహాసంగా, ఆర్భాటంగా కార్యక్రమాలు నిరవహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్ కి జరిమానా చెల్లించడానికి మాత్రం మనస్కరించడం లేదు. ఒకవేళ ఆ సంస్థ డబ్బు చెల్లించకపోతే మరి గ్రీన్ ట్రిబ్యునల్ దానిపై చర్యలు తీసుకొనే సాహసం చేయగలదో లేదో చూడాలి.