పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసి గంటలు గడవకముందే… నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా అసహనం వ్యక్తం చేసింది. నిర్మాణంలో సహైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడింది. హైకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో కమిటీని నియమించాలని నిర్ణయించింది. కమిటీలో ఐఐటీ, ఐఐఎస్ఆర్ నిపుణులు ఉంటారు. పోలవరం నిర్మాణం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను హైలెట్ చేస్తూ… ఎన్జీటీలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణలో పోలవరం నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదని ఎన్జీటీ నిర్ణయానికి వచ్చింది. పర్యావరణ ప్రణాళికలను లోపభూయిష్టంగా రూపొందించారని .. సమస్యలు పదేపదే ఉత్పన్నం అవడానికి అదే కారణమని ఎన్జీటీ అభిప్రాయ పడింది.
సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రళయం.. ఏపీలోనూ జరిగే ప్రమాదం ఉందని ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్జీటీ నియమించబోయే నిపుణుల కమిటీ నిర్దేశాల ప్రకారం పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను మార్చేయడంతో నిర్మాణం చాలా కాలం నిలిచిపోయింది. ఇప్పుడు పనులు మా మాదిరిగా కొనసాగుతున్నా.. కంటిన్యూషన్ సమస్యలు వస్తున్నాయి. గత కాంట్రాక్టర్ ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత కాంట్రాక్టర్ ఉపయోగించలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. న్యాణ్యతపై డిజైన్ల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలోనే.. పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని ఎన్టీటీ వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్ ను 2021 కల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆరు నెలల కాలంలో గత కాంట్రాక్టర్ సిద్ధం చేసిన గడ్డర్లను మాత్రమే.. అమర్చగలిగారు. ఇప్పుడు గేట్ల బిగింగు ప్రక్రియ ప్రారంభమైంది. అదెంత కాలం సాగుతుందో తెలియని పరిస్థితి. అదే సమయంలో… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేస్తేనే కానీ.. నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉండదు. ఇన్ని సమస్యల మధ్య పోలవరం ప్రాజెక్టు కలగా మారుతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.