దిశ అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నలుగురు పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందారు. దీంతో, దిశకు తక్షణ న్యాయం జరిగిందంటూ పోలీసులకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. మరోవైపు, పోలీసులకు జ్యుడిషియరీ నుంచి నోటీసులు జారీ అవుతున్నాయి. ఇదేమీ అనూహ్య పరిణామం కాదు. పోలీసు కస్టడీలో ఉండగా ఈ ఎన్ కౌంటర్ ఘటన జరిగింది కాబట్టి, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా జాతీయ మానవ హక్కుల సంఘం సుమొటోగా ఈ ఎన్ కౌంటర్ వ్యవహారాన్ని స్వీకరించి విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా ఎన్.హెచ్.ఆర్.సి. బృందం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో నలుగురు మృతదేహాలను పరిశీలించింది. అనంతరం ఘటనా స్థలానికి కూడా బృందం వెళ్లింది. ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్ మార్టం జరిగిందా లేదా అని అధికారులు అడిగారనీ, పూర్తి నివేదిక వచ్చేసరికి రెండ్రోజులు పడుతుందనీ, ఆ తరువాత ఎన్.హెచ్.ఆర్.సి.కి దాన్ని అందిస్తామని గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడం, విచారణ కోరడం అనేది రొటీన్ గా జరిగేదే. అయితే దీంతోపాటు, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ హైకోర్టులో కూడా ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టులో కూడా రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై కూడా సోమవారం కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక, శనివారం సాయంత్రం, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కూడా ఒక ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నలుగురి మృతదేహాలను ఉంచడం వల్ల ఇక్కడ భద్రతాపరమైన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, కాబట్టి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి ఈ మృతదేహాలను తరలించాలంటూ కోరారు.
ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న గత సందర్భాల్లో అధికారులను నేరుగా రావాలంటూ పిలిచి, వాదనలు వినిపించాలంటూ మానవ హక్కుల సంఘం కోరుతూ వచ్చింది. ఈ ఘటపై ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే… దాని ముందు అధికారులు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. లేదంటే, వారు సేకరించిన వివరాలు, చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను హైకోర్టుకి లేదా సుప్రీం కోర్టుకి సమర్పించే అవకాశం ఉంటుంది. ఈ ఎన్ కౌంటర్ పై ఎన్.హెచ్.ఆర్.సి. ఏరకమైన వ్యాఖ్యలు చేస్తుందనేది వేచి చూడాలి.