హైదరాబాద్ పాతబస్తీలో ఎన్.ఐ.ఏ. అధికారులు మళ్ళీ మంగళవారం దర్యాప్తు జరిపారు. వారం రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాతబస్తీలో బార్కాస్, తలాబ్ కట్టా ప్రాంతాలలో ఎన్.ఐ.ఏ. అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని బులెట్లు, కంప్యూటర్, స్కానర్ వగైరా పరికరాలని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈసారి పాతబస్తీలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు కానీ మహారాష్ట్రాలోని నాందేడ్ లో నలుగురుని ఈరోజు అరెస్ట్ చేశారు. రేపు రంజాన్ పండుగ కావడంతో ఎన్.ఐ.ఏ. అధికారులు సోదాలు మరింత ముమ్మురం చేశారు. పట్టుబడినవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశంలో మరికొన్ని నగరాలలో కూడా ఎన్.ఐ.ఏ.అధికారులు సోదాలు చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు వరుసగా ఇరాక్, సౌదీ అరేబియాలో ఆత్మాహుతి దాడులు చేయడంతో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్.ఐ.ఏ. అధికారులు తొందరపడటానికి అదీ ఒక కారణం అయ్యుండవచ్చు. పోలీసులు ఎటువంటి హైఅలర్ట్ ప్రకటించనప్పటికీ ప్రజలు రేపు (బుధవారం) తమ జాగ్రత్తలో తాము ఉండటం చాలా మంచిది.