కోడికత్తి దాడి కేసులో అడిగి మరీ వేయించుకున్న ఎన్ఐఏ దర్యాప్తులో కూడా ఎలాంటి కుట్ర లేదని తేలింది. ఇదంతా టైం దండగ వ్యవహారమని ఎన్ఐఏ భావించి… లోతైన దర్యాప్తు కోసం జగన్ వేసిన పిటిషన్ ను కొట్టి వేయాలని కోర్టును కోరింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ వేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని తెలిపింది. అలాగే ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్కు అసలు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందని ఆ దిశగా విచారణ పూర్తి స్థాయిలో చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఈ పిటిషన్లలో కోరారు. అయితే కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చేసింది. నిజానికి కుట్ర ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. అసలు జగన్ పై దాడి జరగలేదని.. జరిగినట్లుగా సానుభూతి కోసం నాటకం ఆడారని అంటున్నారు. ఇదంతా బయటపడుతుదంని వారనుకుంటున్నారు. కానీ ఎన్ఐఏ మాత్రం కుట్ర లేదంటోంది.
విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్పై దాడి చేసిన నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నారు. దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ విచారణ చేయించాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ విచారణ జరిపింది. చార్జిషీటు దాఖలు చేసింది. అయితే విచారణ ప్రారంభమయ్యే సమయంలో సీఎం జగన్ కుట్ర కోణం వెలికి తీయలేదని మరింత లోతుగా విచారణ జరపాలని పిటిషన్ వేయడం చర్చనీయాంశమయింది. అయితే ఎలాంటి కుట్రా లేదని.. ఎన్ఐఏ స్పష్టం చేయడంతో తదుపరి సీఎం జగన్ న్యాయవాదుల బృందం ఎలాంటి అడుగులు వేస్తుంది.. పైకోర్టుకు వెళ్లి మరింత లోతైన దర్యాప్తు కోసం ప్రయత్నిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.