తిరుపతిలో దొంగ ఓటర్ కార్డులను ముద్రించడాన్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో ఆయన నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. దేశ సార్వభౌమాధికార, సమగ్రతకు … దొంగ ఓటర్ కార్డులు తయారు చేయడం ప్రమాదకరమని రఘురామకృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లక్ష్యాలకు ఇలాంటి పనులు చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో లక్షలాది దొంగ ఓటర్ కార్డులు ముద్రించారని.. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుపతి దొంగ ఓటర్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే.. భారత్‌లో ఇలాంటి ఐడీ కార్డులు తయారు చేయడం.. వాటి ద్వారా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడటం ఈజీ అన్న భావన పెరిగిపోతోందని ఆందోళన వెలి బుచ్చారు. తక్షణం కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ అంశంపై దృష్టి సారించి… దొంగ ఓటర్ కార్డుల్ని ప్రింట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓటర్ కార్డులపై ఫిర్యాదుల్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు కూడా పంపినట్లుగా రఘురామరామకృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ఐఏ ద్వారా విచారణకు ఆదేశించాలని కోరారు.
దొంగ ఓటర్ కార్డులు ముద్రించడం నిజానికి చాలా తీవ్రమైన నేరం. కానీ కారణమేమిటో కానీ ఎన్నికల సంఘం కూడా పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు అదేదో కామన్ అన్నట్లుగా వ్యవహరించారు. రేపు ఓటర్ కార్డులకు బదులు పాస్‌పోర్టులు కూడా ముద్రిస్తారనే అంశాన్ని గమించలేకపోయారు. కానీ.. రఘురామకృష్ణరాజు మాత్రం.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి హోంశాఖకు ఎంపీలు చేసే ప్రతి ఫిర్యాదుకు రికార్డు ఉంటుంది. ఏం చర్యలు తీసుకున్నారో ఫాలో అప్ ఉంటుంది. ఈప్రకారం చూస్తే.. తిరుపతి దొంగ ఓటర్ కార్డుల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే ఎన్ఐఏ విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. చాలా పెద్ద పెద్ద కేసులే.. ఏపీకి వచ్చే సరికి స్లో అయిపోతున్నాయి.. ఇదెంత అన్న చర్చ కూడా సహజంగానే వస్తుంది.