పఠాన్ కోట్ దాడులపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లుంది. ఆ దాడులతో పాక్ ఉగ్రవాదులు భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేసినట్లుగానే భావించి అందుకు తగినవిధంగా పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని శివసేన వంటి అతివాదపార్టీలు కోరాయి. పాక్ తో యుద్ధానికి దిగడం వినాశనాన్ని కోరి తెచ్చుకొన్నట్లే అవుతుంది కనుక మోడీ ప్రభుత్వం చాలా సంయమనంగా వ్యవహరించింది. ఈ విషయంలో మొదట పాక్ కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ క్రమంగా దాని అసలు రంగు బయట పెట్టుకొంది.
పఠాన్ కోట్ లో ఇటీవల దర్యాప్తుకి వచ్చిన పాక్ దర్యాప్తు బృందం, పాకిస్తాన్ తిరిగి వెళ్ళగానే భారత్ కి ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ని అప్రదిష్టపాలు చేయడానికే భారత్ స్వయంగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులు చేసుకొందని పాక్ మీడియాకి లీకులు ఇచ్చింది. పాక్ వక్రబుద్ధి గురించి తెలిసి ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడి దానిని అంతగా నమ్మి, దాని దర్యాప్తు బృందాన్ని పఠాన్ కోట్ లోకి అనుమతించడం ఒక పెద్ద తప్పిదమని అర్ధమయింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం మనకి అలవాటే కనుక ఇప్పుడు, అమెరికా నిఘా సంస్థ ఎఫ్.బి.ఐ. మరియు మరి కొన్ని విదేశీ నిఘా సంస్థల సహాకారం కోరింది.
పఠాన్ కోట్ పై దాడులు జరిగిన వెంటనే జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ తమ సంస్థకి చెందిన అల్-కలమ్.కాం మరియు రంగోనూర్.కాం వెబ్ సైట్లలో ‘ఈ దాడులకు తామే సూత్రధరులమని ప్రకటిస్తూ ఒక వీడియో సందేశం పెట్టాడు. ఆ రెండు వెబ్ సైట్లు అమెరికాలోని ఒక వెబ్ హోస్టింగ్ సంస్థ నిర్వహిస్తోంది. దానికి యూరోప్ నుంచి చెల్లింపులు జరుగుతున్నట్లు ఎన్.ఐ.ఏ. గుర్తించింది. ఆ వివరాల ఆధారంగా పఠాన్ కోట్ దాడులకు ఎవరు పాల్పడ్డారో దర్యాప్తు చేయవలసిందిగా ఎఫ్.బి.ఐ.ని కోరింది.
ఇదేపని మొదటే చేసి ఉండి ఉంటే, ఎఫ్.బి.ఐ. దర్యాప్తు చేసి “ఈ దాడులకు పాక్ లో శిక్షణ, సహాయసహకారాలు పొందిన ఉగ్రవాదులే పాల్పడ్డారు..కనుక ఈ కేసులో పాకిస్తానే అసలు దోషి,” అని అమెరికాయే స్వయంగా ప్రకటించి ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం ఈ దాడులకు కుట్రపన్నిన పాకిస్తాన్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ.కి చెందిన అధికారితో కూడిన పాక్ దర్యాప్తు బృందాన్ని పఠాన్ కోట్ లో దర్యాప్తుకి అనుమతించడం విశేషం. పాక్ దర్యాప్తు బృందం కనిపెట్టి చెప్పిన ఆ మాటతో మోడీ ప్రభుత్వానికి కనువిప్పు అయ్యిందేమో తెలియదు కానీ, ఇప్పుడు ఎఫ్.బి.ఐ. సహకారం కోరుతోంది. మోడీ ప్రభుత్వం పాక్ దర్యాప్తు బృందాన్ని పఠాన్ కోట్ లోకి కూడా అనుమతిస్తే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న భారత నిఘా సంస్థ ఎన్.ఐ.ఏ.బృందాన్ని పాక్ లో దర్యాప్తు చేయడానికి ఇంతవరకు పాక్ అనుమతించకపోవడం మరో చెంపదెబ్బగా భావించవచ్చును. ఇంకా ఇటువంటి ఎన్ని చెంపదెబ్బలు తినాలో…ఎన్ని తిన్నాక పాక్ వక్రబుద్ధిని అర్ధం అవుతుందో…ఏమో?