తెలుగు చిత్రసీమలో హీరోయిన్లకు మళ్లీ కొరత వచ్చినట్టే కనిపిస్తోంది. హిట్లు లేకపోయినా, అసలు హీరోయిన్ లక్షణాలు అరకొర మాత్రమే కనిపిస్తున్నా… వాళ్లకే మళ్లీ మళ్లీ అవకాశాలొస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో నిధి అగర్వాల్ కూడా చేరిపోయింది. `సవ్యసాచి`తో ఎంట్రీ ఇచ్చింది నిధి. ఆ సినిమా ఫ్లాప్ అయినా, అఖిల్‌తో `మిస్టర్ మజ్ను`లో ఛాన్స్ అందుకోగలిగింది. ఈ సినిమా కూడా తుస్సుమంది. పైగా నిధికి మైనస్ మార్కులు పడ్డాయి. అయినా సరే, అవకాశాలు ఆగడం లేదు. తాజాగా పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. పూరి – రామ్ కాంబినేషన్లో `ఇస్మార్ట్ శంకర్` అనే చిత్రం ప్రారంభమైంది. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్‌ని ఎంచుకున్నారు. చిత్రబృందం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇందులో మరో కథానాయికకీ స్థానం ఉంది. అయితే రెండో కథానాయికగా ఎవరు కనిపిస్తారో ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. త్వరలో నిధి ఈ చిత్రబృందంతో కలవనుంది.