పబ్లిసిటీ విషయంలో సింప్లిసిటీ వదిలేశారు సినిమా వాళ్లు. ఎంత పబ్లిసిటీ ఉంటే అంత క్రేజ్ ఉన్నట్టులెక్కలేసుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం సొంతంగా జేబులో డబ్బులు పెట్టడానికైనా వెనుకంజ వేయడం లేదు. సాధారణంగా ఈ పబ్లిసిటీ పిచ్చి హీరోలకు ఉంటుంది. కానీ.. ఇప్పుడు హీరోయిన్లూ ఏం తక్కువ చేయడం లేదు. ఈ విషయంలో మిగిలినవాళ్ల సంగతేమో గానీ, నిధి అగర్వాల్ మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది. ఇటీవల `హీరో` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిధి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తను ఎక్కడ పాల్గొన్నా… నిధి ఫ్యాన్స్ అంటూ కొంతమంది వచ్చి హంగామా చేస్తున్నారు. టీ షర్ట్ పై నిధి బొమ్మని ముద్రించుకుని 20 – 30 మంది పోగడిపోతున్నారు. వాళ్లంతా `నిధి… నిధి` అంటూ సినిమా వేడుకలో గోల గోల చేస్తున్నారు. ఇదంతా నిధి అరంజ్ చేసుకున్న సెటప్పే. ఇలాంటి ప్రమోషన్ల కోసం నిధి గట్టిగానే ఖర్చు పెడుతోందని టాక్. వారందరికీ నిధి రోజువారీ బేటాలు ఇస్తోందట. అంతే కాదు.. `హీరో` సినిమా విడుదలకు ముందు, ఆ తరవాత కూడా ప్రత్యేకంగా పార్టీలు ఇస్తోందట. నిధి ఇంటర్వ్యూలన్నీ ఈమధ్య ప్రతీ టీవీ ఛానల్ లోనే కనిపించాయి. వీటిలో సగం… `హీరో` పీఆర్ టీమ్ ఎరైంజ్ చేస్తే… సగం… నిధి పీఆర్వోలు ఏర్పాటు చేశారు. `నన్ను ఈ ప్రశ్నలు అడగండి` అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్లకే.. కొన్ని లీకులు ఇచ్చి మరీ… సమాధానాలు చెబుతోంది నిధి. ఇదో కొత్తరకం పబ్లిసిటీ ట్రిక్కు. `నిధికి పబ్లిసిటీపై ఇంత పిచ్చి ఎందుకొచ్చిందో` అంటూ `హీరో` టీమ్ కూడా ముక్కున వేలేసుకుంటోంది.