చిన్నవో, పెద్దవో.. ఈ సంక్రాంతికి ఏకంగా పది సినిమాలొస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ లు లేకపోయినా – పండక్కి ఏదో ఒకటి దొరికింది లే.. అని సంతృప్తి పడుతున్నారు అభిమానులు. చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికిందని సంబరపడుతున్నారు నిర్మాతలు. కానీ ఈ ఆనందం కూడా ఏపీ ప్రభుత్వం ఉంచేలా కనిపించడం లేదు. త్వరలోనే ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని చూచాయిగా తెలుస్తోంది. ఈనెల 10 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సమాచారం. అదే జరిగితే.. ఈ సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బే. కీలకమైన సెకండ్ షోల్ని రద్దు చేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయే అకావశం వుంది. దేశమంతా… థర్డ్ వేవ్ భయాలుకమ్ముకుంటున్నాయి. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై పడేసింది కేంద్రం. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. త్వరలో ఏపీలో ఈ నిర్ణయం తీసుకుంటే, తెలంగాణలోనూ… అదే పరిస్థితి కనిపించొచ్చు. అదే జరిగితే… సినిమా పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడినట్టు అవుతుంది.