అక్కినేని నాగచైతన్య రాత్రిపూట నిద్రపోయి రెండు రోజులు అవుతోంది. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. ఏమైందని అనుకుంటున్నారా? రాత్రిపూట సినిమా షూటింగుతో సరిపోతుంది. ఇక నిద్రపోయే టైమ్ ఎక్కడిది? అందుకని పగలు కంటినిండా కునుకు తీస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. రెండు రోజుల నుంచి చైతూ, అనూ, మురళీశర్మ తదితరులపై రాత్రిపూట వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు నైట్ షెడ్యూల్ వుంటుందట.
ఓపక్క ‘శైలజారెడ్డి అల్లుడు’ నైట్ షూటింగ్ చేస్తున్న నాగచైతన్య, మరోపక్క ‘సవ్యసాచి’ మార్నింగ్ షూట్ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సవ్యసాచి’ కోసం తమన్నాతో కలసి ఐటమ్ సాంగ్ కోసం స్టెప్పులు వేస్తున్నాడు.