కెరీర్లో తొలి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిందే. అక్కడ తప్పు జరిగితే… మళ్లీ కోలుకోవడం కష్టం. నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’పై చాలామంది ఆశలు పెంచుకున్నారు. మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న సినిమా, పైగా రామరాజు లాంటి మంచి దర్శకుడు తోడయ్యాడు. ఫీల్ గుడ్ మూవీతో అందరి మనసుల్ని గెలుచుకుంటుందనుకున్నారంతా. కానీ నిహారిక అంచనా తప్పైంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కడి నుంచి కోలుకోవడానికి నిహారికకు ఇంత కాలం పట్టింది. అయితే.. ఆ ఫ్లాప్ నిహారికని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్టుంది. అందుకే ‘తొలి అడుగులోనే కోలుకోలేని తప్పు చేశా’ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది నిహారిక. ”నాన్న అప్పటికీ చెబుతున్నారు. ఈ సినిమా ఎంచుకుని సరైన నిర్ణయమే తీసుకున్నావా? అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. నేనే ఈ కథపై నమ్మకంతో ఆ సినిమా ఒప్పుకున్నా. కానీనా అంచనా తప్పింది. అయితే… ఆ సినిమా ఎందుకు చేశానా? అని బాధ పడడం లేదు. అలాంటి పాత్రలు భవిష్యత్తులలో దొరకడం కష్టమనిపించి.. ఒప్పుకున్నా” అంటోంది నిహారిక. ప్రస్తుతం ‘హ్యాపీ వెడ్డింగ్’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతోంది.