మెగా ఇంటి నుంచి చాలామంది హీరోలు వరుస కట్టారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. కానీ.. కథానాయికగా అరంగేట్రం చేసిన ఘనత నిహారికకే దక్కుతుంది. ‘ఒక మనసు’ ఫ్లాప్ అయినా.. నిహారిక నటన అందరికీ నచ్చింది. అంతకు ముందే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. అభిమానుల అంచనాలు, తన పరిధులు, పరిమితులు తెలుసుకుంటూనే కథల్ని, పాత్రల్నీ ఎంచుకుంటోంది. నిహారిక చేసిన రెండో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ శనివారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిహారికతో చేసిన చిట్ చాట్..
* హ్యాపీ వెడ్డింగ్ కథేంటి? అందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– పెళ్లి విశిష్టత గురించి చెప్పే కథ ఇది. పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచనలు, భయాలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక నా పాత్ర విషయానికొస్తే ఇందులో అక్షర అనే పాత్రలో నటించాను. తను తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ కథ మలుపు తిరుగుతుంది. చుట్టూ బోలెడంతమంది నటీనటులు, ఓ పండగ వాతావరణం నేపథ్యంలో సాగే సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈ సినిమాతో తీరిపోయింది.
* మీ పెళ్లి రూమర్లపై ఓ వీడియో తీసి విడుదల చేశారు… అది బాగా వైరల్ అయ్యింది
– అవును.. ఇది చిత్రబృందం ఆలోచనే. ప్రచారానికి ఉపయోగపడేలా, సరదాగా ఏదైనా చేద్దాం అనుకున్నాం. దర్శకుడు ఈ ఐడియా చెప్పారు. వెంటనే నచ్చింది. అందుకే చేశా. సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది.
* ఇంతకీ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
– పెళ్లంటే నాకు గౌరవమే. నా స్నేహితులు చాలామంది పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా గడుపుతున్నారు. నాకు పెళ్లిళ్లన్నా, అప్పుడు జరిగే తంతులన్నా చాలా ఇష్టం.
* మరి మీ పెళ్లెప్పుడు?
– ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. కొంతకాలం సినిమాలు, కథలపైనే దృష్టి పెడదామనుకుంటున్నా. వెబ్ సిరీస్‌లు కూడా చేసే ఆలోచనలున్నాయి.
* కథానాయికగా మీ లక్ష్యాలేంటి?
– స్టార్ డమ్ తెచ్చుకోవాలనో, మరో పదేళ్ల పాటు ఈ రంగంలో కొనసాగాలనో లేదు. మూడు నాలుగేళ్లే నటిస్తానేమో…. ఆ తరవాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. పెళ్లయ్యాక నటించాలో, లేదో ఇంకా నిర్ణయించుకోలేదు. ఒకవేళ నటిస్తే మాత్రం కథల విషయంలో మరింత పక్కాగా ఉంటాను. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేయాలన్న లక్ష్యాలేం లేవు. కొన్నయినా సరే, గుర్తుండిపోయేలా ఉండాలి.
* మెగా అభిమానుల అంచనాలు, మెగా ప్రిన్సెన్ అనే బిరుదు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తోందా?
ఓ గొప్ప కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అంచనాలు ఉండడం సహజం. అయితే అవన్నీ.. ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు భయం వేస్తుంటుంది. కానీ… దాన్ని కూడా గౌరవంగానే చూడాలి. ఇలాంటి అభిమానం ఎంతమంది కథానాయికలకు దక్కుతుంది?
* స్టార్ హీరోలు, పెద్ద దర్శకుల సినిమాల్లో చేయాలని లేదా?
– ఉంది. ఎందుకు లేదూ. కానీ అలాంటి అవకాశాలు రావాలి కదా? స్టార్ హీరో సినిమానా, కాదా? అనేది ముఖ్యం కాదు. మనం చేసే పాత్ర ఎంత బాగుంది? అనేదే ప్రధానం.
* సోషల్ మీడియా పరిధి బాగా పెరుగుతోంది. రకరకాల కథనాలు వినాల్సివస్తోంది. వాటిపై మీ స్పందన ఏమిటి?
– అవును.. సోషల్ మీడియా బలంగా మారుతోంది. అదే బద్దకాన్నీ పెంచుతోంది. గంటలు గంటలు మొబైల్‌కే అంకితం అయిపోతున్నారు. అందుకే రెండేళ్ల పాటు నేను ఫోన్‌కి దూరమయ్యా. ఇప్పటికీ.. ఫోన్ కేవలం మాట్లాడుకోవడానికే వాడుతున్నా. సోషల్ మీడియా జోలికి వెళ్లడం లేదు.
* కథానాయికగా మారేటప్పుడు… ఇంట్లోవాళ్లేమన్నారు?
– అలవాటు ప్రకారం కొన్ని జాగ్రత్తలు చెప్పారు. తప్పు చేస్తే భూతద్దంలో పెట్టి చూస్తారని, మంచి సినిమాలు చేస్తే మాత్రం మనసులో పెట్టుకుంటారని పెదనాన్న చిరంజీవి చెప్పారు. నాన్న కూడా అలాంటి సలహాలే ఇచ్చారు. ఓసినిమా చేసేటప్పుడు మాత్రం పెద్దగా సలహాలు ఇవ్వరు. నా ఇష్టప్రకారం వదిలేస్తారు.
* సైరాలో నటిస్తున్నార్ట..
– అవును. ఖైది నెం.150లో చేయాల్సింది. కుదర్లేదు. ఈ సారి మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోదలచుకోలేదు. చిన్న పాత్రే. కానీ… పెదనాన్న సినిమాలో నటించడం ఓ గొప్ప అవకాశం. నా వికీపీడియా తెరిస్తే…. అందులో `సైరా` అనే పేరు కనిపించాలి. ఆ ఆశతోనే ఈ సినిమా చేస్తున్నా.