నిహారిక కొణిదెల నిర్మాతగానూ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ‘కమిటీ కుర్రాళ్లు’ అనే ఓ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. లాభాలూ అందాయి. ఇప్పుడామె పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి మానస శర్మ అనే దర్శకురాల్ని వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు.
మానస శర్మకు నిహారికకూ మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్ బ్యారర్లో రూపొందించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సిరీస్లకు ఆమె క్రియేటీవ్ హెడ్ గా కనిచేశారు. ఇప్పుడు దర్శకురాలిగా ప్రమోషన్ వచ్చింది. `కమిటీ కుర్రాళ్లు`లానే అంతా కొత్తవాళ్లతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని నిహారిక భావిస్తున్నారు. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలుస్తాయి.
మరోవైపు నటిగా కూడా నిహారిక స్పీడు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. వెబ్ సిరీస్, సినిమాలకు సంబంధించిన కథలు వింటున్నారు. నటిగానూ ఆమె చేసే కొత్త ప్రాజెక్టుల్ని అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.