ఎక్కడికి పోతావు చిన్నవాడా తరవాత నిఖిల్‌కి ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘అర్జున్ సురవరం’ విడుదలకు ముందు పురిటినొప్పులెన్నో పడింది. ఈ సినిమా గురించి జనం కూడా మర్చిపోతున్న తరుణంలో సడన్‌గా వచ్చేసింది. ఇంత డిలే అయిన సినిమా – వసూళ్లు దక్కించుకోవడం, మంచి టాక్ రప్పించుకోవడం చాలా కష్టం. కానీ.. ‘అర్జున్ సురవరం’ మాత్రం అనూహ్యంగా గట్టెక్కగలిగింది. బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ లేకపోవడంతో శుక్రవారం మంచి వసూళ్లే అందుకుంది. శనివారం కూడా ఆ జోరు కొనసాగింది. ఆదివారం కూడా కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో నిఖిల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. ఈసినిమాకి 11 కోట్లబడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. థియేటరికల్ నుంచి రూ.6 కోట్లు వస్తే కొన్నవాళ్లు సేఫ్. అవి ఈజీగానే వచ్చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి సరైన బూస్టప్ కావల్సిన తరుణంలో చిరంజీవి ముందుకొచ్చి – ప్రీ రిలీజ్లో హడావుడి చేసి – ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. అది నిజంగా బాగా హెల్ప్ అయ్యింది. రివ్యూలూ ఓకే అనిపించాయి. దాంతో నిఖిల్ శ్రమ, ఎదురుచూపులు ఫలించినట్టైంది. ఈ జోరులో ఈ సినిమాకి సీక్వెల్ కూడా చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ సైతం ఒప్పుకున్నాడు. ‘కార్తికేయ’, ‘స్వామి రారా’లానే ఈ కథలోనూ సీక్వెల్ లక్షణాలున్నాయని, అన్నీ అనుకున్నట్టు జరిగితే పార్ట్ 2 కూడా ఉంటుందని చెబుతున్నాడు.